డీసీసీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి

డీసీసీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం రిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజీ రావు, సిటీ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ .. భారతదేశంలో టెక్నాలజీ ప్రవేశపెట్టి దేశ యువత తలరాతను మార్చి, వారి భవిష్యత్తును ఉన్నతమైన స్థానాలకు చేర్చి, ప్రపంచ దేశాల్లో భారతదేశ ఉనికిని చాటే విధంగా యువతను ప్రోత్సహించింది రాజీవ్ గాంధీ అని కొనియాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి పల్లెల్లో వెలుగులు నింపి అభివృద్ధి బాటలు వేసినది, 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి యువతను ప్రోత్సహించినది రాజీవ్ గాంధీ అని తెలిపారు.
టెలికం, ఐటీ రంగాలు, కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా టెక్నాలజీ రంగాన్ని తయారు చేశారన్నారు. జాతీయ విద్యా విధానం 1986లో ప్రవేశపెట్టి విద్యారంగంలో ప్రక్షాళన చేశారని, జవహర్ రోజ్ గార్ యోజన, మహిళా సాధికారత వంటి ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ముందుచూపుతో భారతదేశ బలోపేతానికి కావలసిన అన్ని రంగాలను పరిపుష్టి గావించిన దార్శనికుడు, మార్గదర్శకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, కరిమజ్జి మల్లేశ్వరరావు, డి. గోవింద మల్లిబాబు, కె.వి.ఎల్.ఎస్. ఈశ్వరి, ఆబోతుల వెంకట నాయుడు, మామిడి సత్యనారాయణ, లఖినేని నారాయణరావు, ఇజ్జురోతు రమణ, బస్వా షణ్ముఖ రావు, కూరకుల వెంకటరావు, చాన్ బాషా, బేరి వెంకట్రావు, జి. రామారావు, పిన్నింటి పారన్నాయుడు, గొల్లపల్లి దాలయ్య, సనపల రాజులు, వేదాంతం తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
