సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలపై నిఘా…

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; నేర నియంత్రణలో సీసీ కెమెరాలు డేగా కన్నుల ఉపయోగపడతాయని,కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి పేర్కొన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ‘మన ఊరు – మన భద్రత,మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కమ్మర్‌పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో కమ్మర్‌పల్లి జి.అనిల్ రెడ్డి ఆద్వర్యంలో ప్రజలకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు,వాటి ఉపయోగాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ఆయన వివరించారు.

24/7 నిఘా సీసీటీవీ కెమెరాలు గ్రామంలో నిరంతర నిఘా ఉంచుతూ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తాయనీ,ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పోలీసుల విచారణకు మరియు నిందితులను త్వరగా పట్టుకోవడానికి ఈ విజువల్స్ ఎంతగానో ఉపయోగపడతాయనీ,గ్రామాల రక్షణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని,ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని పేర్కొంటూ “కమ్యూనిటీ పోలీసింగ్” లో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.గ్రామ సురక్షితం కోసం స్వచ్ఛందంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి గ్రామస్తులు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ అవగాహన సదస్సులో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.