ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలి…

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని మండలంలోని కాచాపూర్ గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ కోరారు .గురువారం గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడం జరిగిందన్నారు. అనుభవం గల ఉపాధ్యాయులతో, విశాలమైన తరగతి గదులలో, ఉత్తమ విద్యా బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి తరగతి గదిలో అన్ని వసతులు ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫామ్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈసారి జరిగిన పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుభాన్ రెడ్డి, శ్రీరామ్ శేఖర్ తదితరులు ఉన్నారు.
