జీతాలివ్వలేని స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పగించారు : సీఎం రేవంత్
- గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై సీఎం రేవంత్ విమర్శలు..
- బకాయిలతో రాష్ట్రం అస్తవ్యస్తమైందని వ్యాఖ్యలు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఎన్నికల సమయంలో రాష్ట్రంపై రూ.6 లక్షల కోట్ల అప్పు ఉందని తాము చెబితే కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని విమర్శించారని, రూ.4 లక్షల కోట్ల అప్పు కూడా లేదని గత ప్రభుత్వం చెప్పేందుకు ప్రయత్నించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయని తెలిపారు.
ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అప్పులపై పూర్తి వివరాలను సేకరించి శాసనసభలో ఉంచాలని నిర్ణయించామని చెప్పారు. కానీ పరిశీలన కొనసాగిన కొద్దీ మరిన్ని అప్పులు, ఆర్థిక భారాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని దాదాపు 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు విడతల వారీగా జీతాలు చెల్లించే పరిస్థితి ఉండేదని, ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని సీఎం విమర్శించారు. ఆ పరిస్థితిని మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరిపి, ప్రతి నెల ఒకటో తేదీకే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
అంతేకాకుండా గత ప్రభుత్వం బడి పిల్లలకు అందించే పండ్లు, పాలు, కూరగాయలు, దుస్తుల సరఫరాదారులకు కూడా బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు నిలిచిపోయాయని, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో సర్పంచులపై భారీ బకాయిల భారం పడిందని అన్నారు. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా సర్పంచులకు వందల, వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
