కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ హవా
- తొలి రోజే 17 పతకాలు..
- మూడో రోజూ అదరగొట్టిన భారత ఫెన్సర్లు..
- మొత్తం 29 పతకాలు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : నైజీరియాలోని లాగోస్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత ఫెన్సర్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. పోటీల మూడో రోజైన బుధవారం భారత జట్టు సీనియర్ వ్యక్తిగత విభాగాల్లో 3 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం సాధించింది. తొలి మూడు రోజుల ప్రదర్శనతో భారత్ ఖాతాలో మొత్తం 29 పతకాలు చేరాయి. ఇందులో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి.
మహిళల ఫాయిల్‌లో స్వర్ణం–రజతం క్లీన్‌స్వీప్
సీనియర్ మహిళల ఫాయిల్ విభాగంలో భారత క్రీడాకారిణులు ఆధిపత్యం ప్రదర్శించారు. కనగలక్ష్మి స్వర్ణ పతకం సాధించగా.. సహచర క్రీడాకారిణి జాయిస్ అశిత రజత పతకం గెలుచుకుంది. ఈ విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన జార్జియా గ్రీన్, ఎమిలీ గుడ్‌చైల్డ్ కాంస్య పతకాలు సాధించారు.
పురుషుల ఎపీ (Épée) విభాగంలో షెర్జిన్‌కు స్వర్ణం
సీనియర్ పురుషుల ఎపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ షెర్జిన్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన క్రుగర్ పీటర్‌ను ఓడించాడు. ఈ విభాగంలో క్రుగర్ పీటర్ రజతం సాధించగా.. వేల్స్‌కు చెందిన బర్క్‌హార్డ్ మార్క్, దక్షిణాఫ్రికాకు చెందిన లోసెవ్‌స్కీ సెర్గీ కాంస్య పతకాలు గెలిచారు.
సేబర్‌లో కరణ్ సింగ్‌కు స్వర్ణం
సీనియర్ పురుషుల సేబర్ విభాగంలో సింగ్ కరణ్ సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన షిమ్ యోంగీని ఓడించాడు. ఇదే విభాగంలో భారత క్రీడాకారుడు కుమరేశన్ పద్మ గిషో నిధి కాంస్య పతకం గెలుచుకున్నాడు. నైజీరియాకు చెందిన అకిన్యోసోయే ఒలువాఫోలాయెమీ కూడా మరో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
ఛాంపియన్‌షిప్ చివరి దశకు చేరుకోవడంతో భారత బృందం ఫాయిల్, ఎపీ, సేబర్ విభాగాల్లో మిగిలిన పోటీలపై దృష్టి సారించింది. తొలి మూడు రోజుల్లో 29 పతకాలతో జోరు మీదున్న భారత జట్టు.. పోటీలను ఘనంగా ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

