హత్యా రాజకీయాలపై కేటీఆర్‌ ఆగ్రహం..

వెంకటేశం మృతి ఘటనపై పారదర్శక దర్యాప్తుకు డిమాండ్

సిరిసిల్ల, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తోందని, సామాన్యులను బలి పశువులను చేసి రాజకీయ లబ్ధి పొందడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు.

వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక అసలు సూత్రధారులను గుర్తించాలని పోలీసులను కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో తలపడాలని, రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని అన్నారు. అయితే సామాన్య ప్రజలను రాజకీయాలకు బలిపశువులుగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదని మండిపడ్డారు.

రాజకీయ లబ్ధి కోసం మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్లుగా ఉన్నానని, ఇంత దిగజారిన రాజకీయాలను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు సూత్రధారులను తేల్చాలి

వెంకటేశం కుటుంబ పరిస్థితిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని కేటీఆర్ తెలిపారు. తన తండ్రి కోసం కుమార్తె ఎదురుచూస్తూ మూడు రోజులుగా తినలేదని చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ఘటనలో కొంతమంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, వారు కేవలం పాత్రధారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు ఎవరన్నది దర్యాప్తులో తేల్చాల్సి ఉందన్నారు.

ఘటన వెనుక ఎవరున్నా, వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తు, తదుపరి చర్యలు పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులపై ఏమైనా ఒత్తిళ్లు ఉంటే వాటి మూలాలను కూడా వెలికితీయాలని అన్నారు.

కుటుంబానికి అండగా ఉంటా

తాను కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ఆ కుటుంబానికి మాట ఇచ్చిన సోదరుడిగా బాధ్యత తీసుకుంటున్నానని కేటీఆర్ చెప్పారు. వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. బాలిక పదో తరగతి వరకు చదువుకు సంబంధించిన ఫీజులు, ఇతర ఖర్చుల బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున అందించినట్లు తెలిపారు.

వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కేటీఆర్ కోరారు. పూర్తి స్థాయి దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి రావాలని, కుటుంబానికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.