ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలి
ఖమ్మం, ఆంధ్రప్రభ: ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అన్నారు.
బుధవారం ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, నిర్మాణ దశల వివరాలను తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీసి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ ఒక్కో ఇంటిని పరిశీలించారు. పునాదులు, గోడలు, స్లాబ్, పైకప్పు, తుదిదశ పనుల పురోగతిని తనిఖీ చేశారు. ప్రతి ఇంటి నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షించాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తూ, నిర్దిష్ట గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ జయచంద్ర, ఈఈ జగ్గారావు, హౌసింగ్ ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
