అమ్మవారికి ఘనంగా సారె సమర్పణ

  • నెల రోజులపాటు ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగిన ఉత్సవం
  • కనులపండువగా ముగింపు సారె సమర్పణ
  • దేవస్థానం సిబ్బంది కుటుంబాలతో కలిసి అమ్మవారికి సారె
  • సమర్పించిన ఈవో శీనా నాయక్‌ దంపతులు
  • మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ శోభాయాత్ర
  • పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి నెల రోజులుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవం బుధవారం వైభవంగా ముగిసింది. ఆషాఢ బహుళ అమావాస్య, ఆషాఢ మాస ముగింపు సందర్భంగా దేవస్థానం సిబ్బంది కుటుంబ సమేతంగా అమ్మవారికి ముగింపు సారెను సమర్పించారు.

చివరి రోజు బుధవారం జమ్మిదొడ్డి వద్ద ఆలయ స్థానాచార్య ఆధ్వర్యంలో సారె సంభారాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, మేళతాళాలు, కోలాటాల మధ్య కనకదుర్గనగర్‌ మీదుగా సారె సంభారాలతో శోభాయాత్రగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. దేవస్థానం సిబ్బంది తరఫున ఈవో వి.కె. శీనా నాయక్‌ దంపతులు, దేవస్థానం చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ముగింపు సారెను ప్రత్యేకంగా సమర్పించారు.

శోభాయాత్రగా సారే..

జమ్మిదొడ్డి నుంచి బయలుదేరిన సారె శోభాయాత్ర మహామండపం ఆరో అంతస్తుకు చేరుకుంది. అక్కడ కొలువైన అమ్మవారికి పట్టు వస్త్రాలు, మంగళద్రవ్యాలు, ఫలహారాలు, ఇతర సారె సంభారాలను భక్తిశ్రద్ధలతో నివేదించారు.

తరలివచ్చిన భక్తులు..

ఆషాఢ మాస ముగింపు, అమావాస్య కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, సాధకులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. అమ్మవారికి మోదకంతో సారె సమర్పించారు. సారె సమర్పించిన భక్తులకు అర్చకులు సామూహిక ఆశీర్వచనం అందించి ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కోట ప్రసాద్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ సి.హెచ్‌. రంగారావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎల్‌. రమాదేవి, అసిస్టెంట్‌ ఈవోలు ఎన్‌. రమేష్‌బాబు, ఎం. తిరుమలరావు, డాక్టర్‌ కె. గంగాధర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు అశోక్‌కుమార్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సూపరింటెండెంట్లు సి.ఎల్‌.ఎన్‌. రాజు, బి. కళ్యాణి, చందు శ్రీనివాస్‌, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు పి. రాఘవరాజు, హరికృష్ణ, ఎ. శ్రీనివాసరావు, జి. సరోజినీదేవి తదితరులు పాల్గొన్నారు.