అమ్మ సన్నిధిలో కేటుగాళ్లు
దర్శన టికెట్ల గోల్‌మాల్
పంచింగ్ చేయకుండా టికెట్స్ రీ సైక్లింగ్
కీలకంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది..
స్వయంగా హోంగార్డు సైతం అనధికార దర్శనాలకు పంపి రూ. 25 వేలు వసూలు చేసిన వైనం
గతంలో సస్పెండ్ చేసినా కొండపై కొనసాగిస్తున్న దందా
తాజాగా మరో ఇద్దరు రీసైక్లింగ్ చేస్తూ పట్టుబడిన వైనం
ఈవో ఫిర్యాదుతో వన్‌టౌన్ పీఎస్‌లో కేసులు నమోదు..
ఇద్దరు ఉద్యోగుల తొలగింపు
వెలుగులోకి రాని ఇంకొందరు ఉద్యోగులు..
అందరూ భాగస్వాములే అంటూ గుసగుసలు..
వరుస ఘటనలతో మసకబారుతున్న ఇంద్రకీలాద్రి ప్రతిష్ట
నిత్యం ఈవో తనిఖీలు చేస్తున్నా అడ్డుపడని అక్రమార్కుల ఆగడాలు.
కమిషనర్ సారు కాస్త ఇటు చూడండి…
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిపై నకిలీ టికెట్ల వ్యవహారం తీవ్ర దుమారాన్ని లేపింది. నిత్యం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తరలివస్తారు. అయితే ఆలయ సిబ్బంది కొంత మంది ఆదాయానికి గండికొడుతూ అక్రమార్జన చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు భక్తులు కొనుగోలు చేసే టికెట్లను రీ సైక్లింగ్ చేస్తూ అలయ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. తాజాగా వారం రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు బయటకు రావడం సంచలనంగా మారింది.
వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు..
తాజాగా వంద రూపాయల టికెట్ క్యూ లైన్ల వద్ద విధులు నిర్వహించే మహిళా ఉద్యోగి, సెక్యూరిటీ గార్డు కలిసి రూ. 500 టికెట్లను పంచ్ చేయకుండా పక్కన పెడుతున్నారు. తిరిగి వాటిని భక్తులకు విక్రయిస్తూ రీ సైక్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఆలయ సూపర్నెంట్ వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో రెండు ఎఫ్ ఐ ఆర్‌లు నమోదు చేశారు. గతంలో నకిలీ 500 రూపాయల టికెట్ల కేసులో హోంగార్డు చంద్రశేఖర్‌పై సస్పెన్షన్ వేటు పటింది. ప్రస్తుతం ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఇంద్రకీలాద్రిపై టికెట్ల గోల్‌మాల్ వ్యవహారం నిత్యకృత్యంగా మారడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమ్మవారి ఆలయ ఆదాయానికి గండి కొడుతూ కొంతమంది ఆలయ సిబ్బంది ఈ టికెట్లు స్కామ్‌కు పాలు పడుతున్నారు. గతంలో నకిలీ 500 రూపాయల టికెట్ వ్యవహారంలో కూడా నిందితులపై నామమాత్రంగానే చర్యలు తీసుకొని వదిలేశారన్న విమర్శలు సైతం వచ్చాయి. దీంతో కొండపై టికెట్ల గోల్‌మాల్ యథేచ్ఛగా జరుగుతుంది. ఆలయంలో అనధికార దర్శనాలు చేపిస్తూ కొంతమంది ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ నెల 14 న అనధికార దర్శనాలు చేపిస్తూ గతంలో అమ్మవారి ఆలయంలోనే హోమ్ గార్డ్ గా పనిచేసిన చంద్రశేఖర్‌ను కూడా స్వయంగా ఈఓ శీనా నాయక్ పట్టుకున్నారు. 50 మంది భక్తుల దగ్గర 500 చొప్పున 25,000 రూపాయల వరకు కూడా వసూలు చేశారు మళ్లీ మళ్లీ ఇటువంటి ఘటనలు జరగడం చర్చనీయాంశంగా మారుతోంది.
మసకబారుతున్న ఆలయ ప్రతిష్ట…
ఇంద్రకీలాద్రిపై వరుస ఘటనలు ఆలయ ప్రతిష్ట మసకబారే రీతిలో కనిపిస్తోంది. ఆలయ ఈవో శీనానాయక్ నిత్యం తనిఖీలు చేస్తున్నా సిబ్బంది ప్రవర్తనలో మార్పు రాకపోవడం విశేషం. అమ్మ సన్నిధిలో పవిత్రంగా ఉండాల్సిన సిబ్బంది అమ్మ ఆదాయానికే గండికొడుతున్నారు. ఇటీవల వరుస ఘటనలతో ఇంద్రకీలాద్రి నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆలయ టాయిలెట్లలో మృతదేహం, హుండీ కానుకల అపహరణ, బంగారం మాయం ఇలా అనేక ఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా 500 రూపాయల టికెట్ వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. నకిలీ టికెట్లతో అమ్మవారి దర్శనాలు చేయించిన హోంగార్డు చంద్రశేఖర్‌ను అధికారులు స్వయంగా పట్టుకొని సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని విధుల నుంచి తొలగించారు. తాజా ఘటనతో అసలు ఆలయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అసలు పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారన్న అన్న ప్రశ్న ఉద్భవిస్తోంది. దుర్గగుడిలో వరుసగా వెలుగులోకి వస్తున్న అక్రమాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుని, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
మరికొందరి ఉద్యోగుల పాత్ర పై అనుమానం..
అయితే దుర్గగుడిలో అనధికారిక దర్శనాలు రీసైకిలింగ్ టిక్కెట్లు వంటి వ్యవహారంలో దుర్గగుడి ఉద్యోగుల పాత్ర పై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో పట్టుబడిన హోంగార్డు చంద్రశేఖర్ నువ్వు విచారిణించిన సమయంలో కూడా నలుగురు ఉద్యోగుల పాత్ర చెప్పినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో అనధికారికంగా రీసైకిల్ టికెట్లు చేస్తున్న ఉద్యోగుల సైతం కొందరు ప్రోటోకాల్, మరికొందరి ఉద్యోగుల సహాయంతోనే ఇటువంటి బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. విషయం వెలుగులోకి వచ్చినప్పుడు కేవలం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మాత్రమే బలి పశువులను చేస్తున్నారని అసలు వ్యవహారాన్ని నడిపే అతి ముఖ్యమైన కొందరి నీ విచారించడం లేదన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా పట్టుబడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి వాసు ఫోన్ పే వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎంతోమంది ఆలయ ఉద్యోగుల బండారం సైతం ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.
కమిషనర్ సారు ఇటు చూడండి..
దుర్గ గుడిలో యదేచ్చగా జరుగుతున్న ఇటువంటి దందాలపై కమిషనర్ రామచంద్ర మోహన్ దృష్టి సారించాలని తోటి ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. విషయాలు వెలుగులోకి వచ్చిన సందర్భంలో పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి బాధ్యులైన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటే మరల పునరావృతం అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. విషయం బయటపడిన సందర్భంలో తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చిరుద్యోగులను బలి పశువులు చేయకుండా అసలైన వెనక్కుని నడిపించే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
