ఎనీ టైం నో మనీ..

ఎనీ టైం నో మనీ..

  • పని చేయని ఏటిఎంలు..
  • ఖాతాదారుల ఇక్కట్లు..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఖాతాదారులకు తమ బ్యాంకు ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని గొప్పలు ప్రచారం చేసే బ్యాంకులు అవేమి పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎనీ టైం మనీ కేంద్రాల్లో ఎనీ టైం నో మనీ అనే విధంగా తయారయింది. పెద్దపల్లి పట్టణంలో వివిధ బ్యాంకులు ఏర్పాటు చేసిన ఏటిఎం సేవలు ఖాతాదారులకు ఉపయోగపడడం లేదు. ఎప్పుడు ఏటిఎంకు నగదు డ్రా కోసం వెళ్ళినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయని పలువురు ఖాతాదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో రద్దీని నివారించేందుకు సులభతరంగా ఖాతా నుండి డబ్బులు తీసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఏటిఎంలు సరిగా పనిచేయడం లేదు.

బ్యాంకులకు సెలవు దినాల్లో అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్నవారు నగదు డ్రా చేసుకోవడానికి ఏటిఎం సెంటరుకు వెళితే నిరాశే ఎదురవుతోంది. బ్యాంకర్లకు ఏటిఎంలో నగదు కొరత గురించి వివరిస్తే సరిగా స్పందించడం లేదని ఓ ఖాతాదారుడు ఆగ్రహించాడు. ఎనీ టైం నో మనీ అనే రీతిలో ఏటిఎంల నిర్వహణ ఉందని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎం కార్డుల వినియోగానికి చార్జీలు విధించే బ్యాంకర్లు ఎల్లపుడూ నగదు అందుబాటులో ఉంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా బ్యాంకుల అధికారులు సదరు ఏటిఎంలలో నగదు అందుబాటులో ఉండేలా చూడాలని కస్టమర్లు కోరుతున్నారు.