31 డిమాండ్లతో సమ్మె నోటీసు: ఏఐటీయూసీ

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్ సీహెచ్‌పీలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కార్మికుల సమావేశం నిర్వహించారు. ఫిట్ కార్యదర్శి హరి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హరి రామకృష్ణ మాట్లాడుతూ, సీహెచ్‌పీలో వాటర్ ట్యాంకర్, మెరిట్ బంకర్ షీట్లు, యాక్టింగ్ ప్రమోషన్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. జనరల్ షిఫ్ట్, డిస్ట్రిబ్యూషన్ షెడ్ సమస్యలపై త్వరలో మరో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

అక్బర్ అలీ మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యానికి 31 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. సొంతింటి పథకం, మెడికల్ బోర్డు, కొత్త బావుల ఏర్పాటు, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు, పెర్క్స్‌పై పన్ను రద్దు, ప్రమోషన్ పాలసీ, క్యాడర్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

12వ వేతన కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతున్నందుకు నిరసనగా జూలై 1న డిమాండ్స్ డే నిర్వహిస్తామని, సమస్యలు పరిష్కరించకపోతే కోల్ ఇండియా, సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులను ఆదర్శంగా తీసుకుని పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు సీతారామారావు, నాగరాజు, విజయ్‌కుమార్, కృష్ణస్వామి, సిరాజుద్దీన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.