ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సెరికల్చర్ కరెంటు వినియోగం
- లక్షలాది రూపాయల విద్యుత్తు అక్రమంగా వినియోగం
- సపరేటు మీటర్ మీద వాడాల్సి ఉన్నా నిబంధనలను పాటించని కాంట్రాక్టర్
- డీడీలు కట్టాం ఇంకా రాలేదని జవాబు
- కొత్త మీటర్లు వచ్చిందాకా ఆగకుండా నిబంధనకు విరుద్ధంగా విద్యుత్ వినియోగం
- పరిశీలించిన విద్యుత్ శాఖ అధికారులు
అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణ పనులు వాస్తవానికి అనధికారికంగా మూడు నెలల క్రితమే ప్రారంభం కాగా ఈనెల 9న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభింపజేశారు. వాస్తవానికి విద్యుత్ శాఖలో నిబంధనల ప్రకారం ఏదేని కాంట్రాక్టర్ తన పనిని ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా విద్యుత్ శాఖ నుంచి వచ్చిన మీటర్ను పని ప్రదేశంలో అమర్చిన తర్వాతే అధికారికంగా పనులు ప్రారంభించాలి.

కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా గడిచిన మూడు నెలల నుండి సెరికల్చర్ విభాగానికి చెందిన త్రీఫేస్ ఒకటి, సింగిల్ ఫేస్ ఒకటి మీటర్లను యదేచ్చగా వినియోగిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం అవుతున్న ఈ ప్రాజెక్టులో మూడు నెలల నుండి పూర్తిస్థాయి నీటి వినియోగానికి ,రాడ్ బెండింగ్ కు ఇతరత్రా విద్యుత్ పనులకు పూర్తిస్థాయిలో ఈ మీటర్లను వినియోగిస్తున్నారు అంటే విద్యుత్తును ఏ స్థాయిలో చౌర్యం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా బహిరంగంగా అక్రమంగా వేరే డిపార్ట్మెంట్ కు చెందిన మీటర్లను వినియోగిస్తున్నా సరే విద్యుత్ శాఖ అధికారులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకపోవటంపై సర్వత్ర తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వాస్తవానికి ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణానికి గాను సెరికల్చర్ కు చెందిన 20 ఎకరాల భూమిని విద్య మరియు సంక్షేమ మౌలిక వనరుల అభివృద్ధి సంస్థకు అప్పగించారు. స్థలాన్ని అప్పగించిన సరే ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఆ శాఖకు చెందిన విద్యుత్ మీటర్లను 200 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టులో వినియోగించడం చట్టరీత్యా నేరం. అయినా దర్జాగా రెండు మీటర్లను మూడు నెలల నుండి వినియోగిస్తున్నారు. సంఘటన స్థలంలో మాత్రం ఒక జనరేటర్ను అమర్చి ఏదో దీని ద్వారానే పనులు మొత్తం నిర్వహిస్తున్నట్లు చెప్పకనే చెబుతున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందగా విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ ,లైన్ మెన్ లు సంఘటనా స్థలానికి చేరుకుని పని ప్రదేశంలో జరుగుతున్న అక్రమాన్ని గుర్తించారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి గాను కాంట్రాక్టర్ విద్యుత్ శాఖకు మీటర్ కోసం డబ్బులు చెల్లించిన మాట వాస్తవమేనని అది ఇంకా ప్రాసెస్ లోనే ఉన్నదని ప్రాసెస్ లో ఉండగా ఈ విధంగా మీరు విద్యుత్ ని వినియోగించడం నేరమని వారు పేర్కొన్నారు. కొత్త మీటరు వచ్చినదాకా ఆగవలసింది అని మీటర్ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో మీటర్ను సెట్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్ను తర్వాత అయినా ఏర్పాటు చేసుకోవచ్చు అని వారు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంలో జరిగిన విద్యుత్ అక్రమంపై చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఏఈ వివరణ: మీటర్లను వినియోగించడం చట్టరీత్యా నేరమని మీటర్లను డిస్కనెక్ట్ చేసి వినియోగంపై కేసు నమోదు చేస్తామని ఏఈ పేర్కొన్నారు.
