Story | ఈ వారం క‌థానిక.. మ‌రిచిపోలేని అపురూపం ప్రేమంటే..

లవ్వుల గయ్యన్నీ జూస్తమా సారూ!

మొన్నోరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తయ్యి మేకప్ తీసి కారెక్కేసరికి రాత్రి 12 దాటింది. మూడు రోజుల ముందు నుండీ గమనిస్తున్నాను ఆ డ్రైవర్‌ని. మాసిన గెడ్డంతో కళ్లు గుంత‌లుపడి బుగ్గలు పీక్కుపోయినట్లు ఉంటాడు. వయసు 30 అని అతను చెప్పినా ఇంకా పెద్ద వయసువాడిగా కనిపిస్తున్నాడు. అడిగినదానికి ముక్తసరిగా ఒక్క మాటలో సమాధానం చెప్పి సైలెంట్ అయిపోతాడు. డ్రైవింగ్‌లో మాత్రం పర్ఫెక్ట్. రాత్రి ప్రయాణమంటే నేనెప్పుడూ డ్రైవర్‌తో ముచ్చట్లు పెడుతుంటాను.. అతనికి నిద్ర రాకుండా.

వెనక సీట్లో కూర్చున్న నా అసిస్టెంట్ బాలు “సార్ ఈ అన్నకి పెద్ద లవ్‌స్టోరీ వుంది సార్” అన్నాడు. ఆ మాట తర్వాత కూడా డ్రైవర్ మొఖంలో చిన్న చిరునవ్వు కూడా రాలేదు. అతనిని మాట్లాడించాలని నేనే” మీకభ్యంతరం లేకపోతే సరదాగా మీ లవ్‌స్టోరీ చెప్పండి” అన్నాను. ఏమనుకున్నాడో ఏమో ఏవిధమైన భావోద్వేగమూ లేకుండానే చెప్పటం మొదలుపెట్టాడు.

మాది కల్వకుర్తి సారూ.
నేను సదూకోలేదు. నల్గురు అన్నదమ్ములం.
కర్సులెక్కువవెట్టి వ్యగసాయంల దివాలా దీసిర్రు.
నేను డ్రైవింగ్ జేసుకుంట మంచిగ సంపాదిస్తుంటి.
వాల్లనుగూడ టైల్స్ పనిలో పెట్టిచ్చిన.

గా పిల్ల ఇంటర్మీడియట్టు సదూతుండె.
పుస్తకాలు చేతిలవట్టుకుని పోతా కన్పిస్తుండె.
ఒకదినం గా పిల్లకేమైనదో దెల్వది.. నన్ను జూసి కిసుక్కున నవ్వినది సారూ. నాకెట్లనో ఐనది.
రెండు దినాల తర్వాత నేనుబీ గా పిల్లని జూసి చిన్నంగనవ్విన. గంతే.

దినామూ ఒకర్నిజూస్కునిఒకరు నవ్వుకునుడే నవ్వుకునుడు.
నాకు మనసుల ఏమైతున్నదో నాకే అర్తమవ్వకపొయ్యేడితి.
దినామూ గా పిల్లని జూడంగనే జరమొచ్చినట్టైతది నాకు.

ఏమైతే గదైందని వాల్లింటికేపొయిన.
గప్పుడేదెల్సింది గా పిల్లకి తల్లి అక్క దప్ప అయ్య లేడని.
ఆస్తి అసల్కే లేకపాయె. అయినా లవ్వుల గయ్యన్నీ జూస్తమా సారూ.
అప్పటిసంది నా పనంతా ఆగమాగమైపాయె.
ఎప్పుడూ ఆ పిల్లతానే ఉండాలనిపిచ్చేటిది.

బాగ ఆలోసించినంక గా పిల్లకిజెప్పిన. “ఊర్ల ఉంటే నిన్నుజూస్త పన్జెయ్యలేకపోతున్న. నిన్ను హాస్టల్ల ఏసి నేను అయిదరబాదు పొయి డ్రైవింగ్ జేసి సంపాదిచ్చి నిన్ను దీస్కపోయి పెల్లి జేస్కుంట అప్పటిదంక సక్కంగ సదూకో” అని బతిమాలి ఒప్పిచ్చి హాస్టల్‌ల ఫీజుకట్టి గా పిల్లనివెట్టి నేను అయిదరబాదు ఒచ్చేసిన.

ఒక ఓనరుగారు బాడుగకుదిప్పే కారు డ్రైవింగ్ జేస్తున్న.

ఒకదినమేమైనదో దెల్సా సారూ……

నేనొక పార్టీని తిర్పతికి తోల్కపోనీకి రెడీ అయితున్న. పోనొచ్చింది.
గీ పిల్ల. “నేనుబీ అయిదరబాదొచ్చిన పలానా బస్టాండుల ఉన్న వొచ్చి తోల్కపో” అన్నది.
నాకు పిచ్చిలేసింది.
పార్టీని బతిమాల్కుని బస్టాండుకి పొయిన.

సూస్తె ఒక పెట్టె వట్టుకుని నిలబడుండె గీ పిల్ల. నన్ను జూడంగనే ఏడ్సుడు సురూ జేసింది. “నేనాడుండ. నిన్ను సూడకుండ ఉండలేకపోతున్న. నేనింక సదవ ఏంజేస్తవో జెయ్యి” అనె.

మైండంతా కరాబైంది.
మా ఓనరుగారి అక్క శానా మంచిది సారు. ఆమెకు ఫోన్జేసి గిట్లసంగతి అమ్మా అనిజెప్పిన. నాకాడికి తోల్కరా అంటే తీస్కపోయిన. పిల్లని గాడ ఇడ్సివెట్టి నేను తిర్పతి ట్రిప్పు పోయోచ్చిన. రెండునెల్లు ఆ మహాతల్లే గా పిల్లని బిడ్డలెక్క జూసుకున్నది సారూ..

తర్వాత పెండ్లిజేస్కున్నం.
గది మావోల్లకి ఇష్టం లేక నాతోని మాట్లాడుడు బంద్ జేసిర్రు.
మీరు చెబితే నమ్మరు సారూ…. “లైఫ్ల గింత సంతోషం ఉంటదా అనిపిచ్చేది సారూ. గా పిల్ల మాయమ్మకంటే నన్ను బాగజూస్కునేది.

ఏంది నాకింత అదృష్టం అనిపిచ్చేది సారూ. బాగా కష్టవడి పని జేసిన. సొంతంగ గీ ఇన్నొవా కారు కొన్న.అప్పులన్నీ దీర్సేసిన. నువ్వు ఇంకాఇంకా కొంటవ్ తీ నువ్వు మొగోనివి అని నవ్వేటిది నా పెండ్లాం. ఎంక్రేజ్మెంట్ అంటే నా పెండ్లాన్నేజెప్పుకోవాల సారూ. మాయబ్బాయి పుట్టిండు.

జెప్పిన్నుగద లోకంల సంతోషమంటే మాదేసారూ. పిల్లోనికి ఏంగావాలంటే గది కొనిస్తుండె.స్వరగమంటే ఏందో జూసిన సారూ. గా పిల్లకి మల్లీ కడుపొచ్చింది. అప్పుడే ఎందుకు కడ్పు తీయించుకోమనె లేడీ డాక్టరమ్మ. నేన్‌బీ గదేజెప్పిన. గయ్యిమని నామింద లేసినది నా పెండ్లాం. “దేముడిచ్చినప్పుడే కనాలగానీ నిర్ణయాలు దీస్కోనీకి మనమెవ్వరం” అనె. సరే అనకేమ్జేస్తం మనం. మా కల్వకుర్తిలోనే డాక్టర్లు కడుపు కోసి ఆడబిడ్డని బైటికిదీసిర్రు. నాకు మస్తు కుషీ అయ్యింది.

తర్వాత చెప్పటం ఆపేశాడు.

“తర్వాతేం జరిగింది” అన్నాను.

నా పెండ్లాం కండ్లు తెరిసి బిడ్డని జూసింది లేదు.పాలిచ్చింది లేదు. రక్తం పోతానేవున్నదంట. ఏదో సీరియస్ అయ్యింది ఎంటనే అయిదరాబాదు తీస్కపోండ్రి అని రాసిచ్చిర్రు. తీస్కచ్చిన. మస్తు కర్చువెట్టిన. ఇర్వయ్ రోజులు గీడ ఆస్పత్రిలోనే వుండె.

మళ్ళీ చెప్పటం ఆపేశాడు.

తర్వాత…?

తర్వాతేమున్నది సారూ…
సచ్చిపోయిందని పీన్గెని చేతిల వెట్టిన్రు.”మీ ఊర్ల ఆస్పత్రిలోనే పేగు తప్పుగ కడ్ జేసిండ్రు అందుకే గిట్లైంది పొయి వాల్లమింద కేసువెట్టుపో” అన్నరు.

గా పిల్లని ఒల్లో పడుకోబెట్టుకుని ఎంతేడ్సిన్నో నాకేదెల్వదు సారూ. ఊర్కి దీస్కపోయి తగలవెట్టిన. మావోల్లెవ్వరూ రాలె. సపోర్ట్ లేనోన్ని కేసులేం పెడ్తన్ సారూ నేను.

మరిప్పుడు పిల్లల్నెవరు చూసుకుంటున్నారు?

నా పెండ్లాం పోయేదానికి మూడ్నెల్ల ముందే మాయమ్మ సచ్చిపాయే. నా పెండ్లాం సచ్చినంక మాయత్త పిచ్చిదాయే. కల్వకుర్తిలోనే గా పిల్లవాల్ల అక్క చూస్కుంటున్నదిసారూ ఆమె పిల్లల్తోపాటు. బాబు యూకేజీ,పాప నర్సరీ లో ఉన్నరు. వాళ్ళాయన తాగుబోతు మొదట్లో ఆ దరిద్రం మనకెందుకని తిట్టేటోడు.

గొడవవ్వంగనే నేనుపోయి పిల్లల్ని తెచ్చుకుని కార్లో కూసోబెట్టుకునే బాడుగ తోలేటోడిని. అస్సలు గొడవజెయ్యరు పిల్లలు.ఎక్కడకూసోబెడితే అక్కడ కదలకుండ బొమ్మల్లెక్క కూసొంటరుసారూ. పెడితే తింటరు లేకుంటే కుయ్క్ కయ్క్ అనరు. ఒక దినం నేను పొయ్యి పదివేలు గా తాగుబోతోడి సేతులవెట్టి దన్నంబెట్టి “నువ్వేం పన్జెయ్యొద్దు మొత్తం నీ కుటంబం కర్చు బీ నేనేజూస్కుంట” అని ప్రతి నెల ఆ కుటంబం కర్చంతా నేనే జూస్కుంటున్న సారూ.

నా పిల్లలకోసం నేనెంతైనా కష్టవడ్త సారూ. అర్దరాత్రి బాడుగవొచ్చినా నిద్దర రాకుంట కంట్ల అమృతాంజనం వెట్టుకుని బండి సక్కంగ తోల్త సారూ. మొన్న కుంబమేలాకి పది ట్రిప్పులు తోల్న. కష్టవడ్తగానీ ఒక్కరూపాయకి ఎవ్వర్దగ్గరా చెయ్‌జాపను సారూ.

పది నిముషాలకోసారి నా పిల్లలు గుర్తుకొస్తనేవుంటరు సారూ. ఒక్కోసారి గుర్తుకొచ్చిర్రంటే అర్దరాత్రి అయినా బండేస్కుని కల్వకుర్తి పొయ్యి చూసొస్తా.

నా బిడ్డ అచ్చం నా పెండ్లాం లెక్క వుంటదిసారూ. నన్ను చూడంగనే వొచ్చి నా గుండెలకి అతుక్కుపోతది. నా గుండెలమీద్నే పంటది.

ఇయ్యాల పొద్దుగాల్నే మా పిల్లల్ని గీడికి తీసుకొచ్చిన్రని ఫోనొచ్చింది సారూ.. షూటింగ్ ఎప్పుడైపోతదా మిమ్మల్ని దించేసి ఎప్పుడు ఇంటికాడికి పొయి పిల్లల్ని జూద్దామా అని పేణం కొట్టుకలాడతంది సారూ. వాల్లో నెలరోజులు నా తానేవుంటారు.ఈ నెలరోజులూ నేను డూటీకి పోను సారూ. పిల్లలకి నేనే ఒండిపెట్టుకుంట వుంటా.

మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చుగదా ? పిల్లల్ని చూసుకోవటానికైనా ?

ఒచ్చినామె నా బిడ్డల్ని సక్కంగ జూస్కోకపోతే నా గుండెవగులుద్ది సారూ.. అయినా రెండేండ్లయితున్నా నా పెండ్లాన్ని మర్సిపోవుడు నాసేతనైతలేదు. నా కండ్లల్ల ఉన్నట్టేవుంటదిసారూ అదేందో.

నా బతుకంతా నా పిల్లలే సారూ. గా పిల్ల బతికుంటే పిల్లల్ని ఎట్ల జూస్కొనెడిదో అట్లజూస్కోవాలె నేను. గంతకమించి నాకేమొద్దుసారూ.

మా ఇంటిముందు కారాగింది. గుండె అంతా ఏదో తెలియని బరువుతో నిండిపోయింది.

స్నానం చేసి పడుకున్నా,తెల్లవారుఝాము అవుతున్నా నిద్ర పట్టలేదు. ఆ డ్రైవర్ ఇంటికివెళ్ళగానే నిద్రలేచిన పిల్లలు అతని కాళ్ళకి చుట్టుకొనే దృశ్యం రెప్పలు మూసుకున్న నా కళ్ళలో కదలాడుతూనేవుంది.

  • సేక‌ర‌ణ‌..
    ర‌చ‌యిత దేవీ ప్ర‌సాద్‌

Leave a Reply