హైదరాబాద్ – కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్న విద్యార్దులపై నేడు పోలీసులు లాఠీచార్జీ చేశారు.. హెచ్‌సీయూ క్యాంపస్‌ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, వర్సిటీ లోపలికి బయటి వ్యక్తులను రానివ్వకుండా చేయడంతో పాటు విద్యార్థులను బయటకు పోనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో విద్యార్థులు, ప్రొఫెసర్లు నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లు, విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హెచ్‌సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ వారు నిరసనలు తెలుపుతున్నారు. దాంతో పోలీసుల తీరుపై ప్రొఫెసర్లు, విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ, పోలీస్ జులుం నశించాలని నినాదాలు చేశారు. దీంతో హెచ్‌సీయూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఖండించిన హరీశ్ రావు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని రేవంత్ రెడ్డి సోకాల్డ్ ప్రజాపాలన తలపిస్తుందని ధ్వజమెత్తారు. హెచ్‌సీయూ విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్లపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. పచ్చని అడవిని నాశనం చేయొద్దని శాంతియుతంగా నిరసనకు దిగిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు.