రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్వీకరించని కుటుంబ సభ్యులు

  • ‘అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు’..
  • పోలీసులకు రాతపూర్వక ప్రకటన
  • పోలీసు నిబంధనల ప్రకారమే అంత్యక్రియలకు ఏర్పాట్లు
  • నిందితుడి సెల్ఫీ వీడియో స్వాధీనం..
  • హత్యలకు ముందు రికార్డు చేసిన ‘డైయింగ్ డిక్లరేషన్’పై దర్యాప్తు

ఆంధ్రప్రభ, రంగారెడ్డి : షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరుగురు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు స్వీకరించేందుకు నిరాకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు సంప్రదించగా, “రాజ్‌కుమార్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదు” అంటూ కుటుంబ సభ్యులు రాతపూర్వకంగా ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండానే పోలీసు నిబంధనల ప్రకారం చేవెళ్ల శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

నిందితుడి మొబైల్‌లో సంచలన వీడియో…

ఈ కేసు దర్యాప్తులో కీలక ఆధారంగా రాజ్‌కుమార్ మొబైల్ ఫోన్‌లో లభించిన సెల్ఫీ వీడియో నిలిచింది. జులై 10 సాయంత్రం 4:55 గంటల సమయంలో ఈ వీడియోను అతడు రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి మృతదేహం లభించిన ప్రాంతంలోనే మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. వీడియోలో తనపై జరిగిన ఆర్థిక మోసాలు, నమ్మకద్రోహమే ఈ ఘాతుకానికి కారణమని రాజ్‌కుమార్ పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక యువతిని గుడ్డిగా నమ్మి తన సంపాదనలో ఎక్కువ భాగం కోల్పోయానని, చివరకు తనను ఆర్థికంగా నాశనం చేసి తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు కుట్ర చేశారని వీడియోలో ఆరోపించినట్లు సమాచారం.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న నిందితుడు..

అయితే వ్యక్తిగత కక్షలు, ఆర్థిక వివాదాలు ఉన్నప్పటికీ చట్టాన్ని ఆశ్రయించకుండా, అమాయకుల ప్రాణాలు తీయడం అత్యంత దారుణమని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా తన భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు మరో కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత పాశవికంగా హత్య చేయడం సమాజాన్ని కలిచివేసిందని అధికారులు తెలిపారు.

రాజ్‌కుమార్‌పై గతంలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం తనపై కేసు పెట్టిన కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట షాబాద్‌లోని ఓ మైనర్ బాలిక ఇంటికి వెళ్లి, ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న బాలిక తల్లి, నాయనమ్మలను హత్య చేసిన అనంతరం బాలికను మరో ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపాడు. అనంతరం తన ఇంటికి చేరుకుని భార్య సరిత, ఇద్దరు చిన్నారులను కూడా హతమార్చి పరారయ్యాడు. తర్వాత తన మేనమామ గ్రామమైన పెంజర్ల ప్రాంతానికి వెళ్లిన రాజ్‌కుమార్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతని మృతదేహం సోమవారం అక్కడ లభించింది.

అన్ని కోణాల్లో దర్యాప్తు…

సెల్ఫీ వీడియో, డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ ఘటనలో మరెవరైనా పాత్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను శాస్త్రీయ ఆధారాలతో పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.