జీజీహెచ్ లో ఉద్రిక్తత

జీజీహెచ్ లో ఉద్రిక్తత

  • రెండో రోజు శానిటేషన్ కార్మికుల ఆందోళన
  • సమ్మెతో నిలిచిన సేవలు
  • మూడు నెలల వేతనాలు బకాయి చెల్లించాలి..
  • సూపరింటెండెంట్‌ను కలిసేందుకు ప్రయత్నం..
  • అడ్డుకున్న పోలీసులు…
  • సీపీఎం మద్దతుతో ఆందోళన మరింత ఉధృతి

ఆంధ్రప్రభ, విజయవాడ : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికుల సమ్మె ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై ఆగ్రహంతో కార్మికులు సమ్మె శిబిరం నుండి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో కార్మికులు అక్కడికక్కడే భీష్మించుకుని కూర్చొని నిరసన కొనసాగించారు.

గడిచిన మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ పారిశుద్ధ కార్మికులు రెండు రోజుల నుండి జిజిహెచ్ లో నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు వాపోయారు. వెంటనే సూపరింటెండెంట్‌ను బయటకు రప్పించి సమస్య పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే తామే లోపలికి వెళ్లి మాట్లాడుతామని హెచ్చరించారు.

మద్దతుగా సీపీఎం…

వేతన బకాయిల కోసం రెండు రోజుల నుండి జిజిహెచ్ లో ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం నాయకులు రంగంలోకి దిగడంతో ఆందోళన మరింత వేడెక్కింది. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.హెచ్ బాబురావు మాట్లాడుతూ.. మూడు నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కాంట్రాక్టర్ కనీసం హాజరు కావడం లేదని, చట్టం ప్రకారం ప్రతి నెల మూడో తేదీన వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ వ్యవస్థలో పారదర్శకత లేకుండా బినామీల ద్వారా వ్యవహారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టర్ను అధికారులే రప్పించి రాతపూర్వక హామీ ఇస్తే సమ్మె విరమించేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఆసుపత్రిలో క్షీణించిన పారిశుధ్యం…

పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రభావంతో ఆసుపత్రిలో పారిశుధ్య సేవలు దెబ్బతిని, రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎక్కడికక్కడ వ్యర్ధాలు పేరుకుని ఉండికపోవడం, తొలగించకపోవడంతో అపరిశుద్ధ్య తాండవిస్తోంది. సమస్య తక్షణమే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply