స్పోర్ట్స్ డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి -శాప్

స్పోర్ట్స్ డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి -శాప్
విజయవాడ, ఆంధ్రప్రభ: స్పోర్ట్స్ డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నియమబద్ధంగా, బహుళస్థాయి ధృవీకరణల ఆధారంగా నిర్వహించబడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని మీడియా వర్గాల్లో ప్రచారంలోకి వచ్చిన ఆరోపణలు, ఫేక్ ఆడియోలు, డబ్బుల వసూళ్ల వ్యవహారాలపై అధికారికంగా వివరణ విడుదల చేసింది.
స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 421 మెగా డీఎస్సీ పోస్టుల భర్తీకి 2025 మే 1న నోటిఫికేషన్ జారీ చేసినట్లు శాప్ తెలిపింది. దాదాపు 3,600 మంది అభ్యర్థులు 5,328 పోస్టు ప్రాధాన్యతలతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. నియామక ప్రక్రియలో ప్రతి క్రీడా సర్టిఫికెట్‌ను సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు, విశ్వవిద్యాలయాల నుంచే అధికారికంగా ధృవీకరించిన తర్వాత మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ధృవీకరణ లేని ఏ ఒక్క సర్టిఫికెట్‌ను కూడా ఎంపిక ప్రక్రియలో ఉపయోగించలేదని స్పష్టం చేసింది.
శాప్ ఎలాంటి క్రీడా సర్టిఫికెట్లు జారీ చేయదని తెలిపింది. సర్టిఫికెట్ల సృష్టి లేదా మార్పిడి ప్రక్రియలో సంస్థకు సంబంధం లేదని పేర్కొంది. బయటి వ్యక్తుల జోక్యం, ప్రలోభాలు, అక్రమ ప్రభావాలకు అవకాశం లేకుండా మొత్తం ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నిర్వహించినట్లు వివరించింది. స్పోర్ట్స్ డీఎస్సీ పోస్టుల పేరిట డబ్బులు డిమాండ్ చేస్తూ ఫేక్ ఆడియోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో వెంటనే అప్రమత్తమైనట్లు శాప్ తెలిపింది. అభ్యర్థులు మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు పేర్కొంది. ఫేక్ కాల్స్ వస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రత్యేక ప్రకటన విడుదల చేసినట్లు తెలిపింది.
ఈ వ్యవహారంపై 2025 జూలై 25న విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు శాప్ వెల్లడించింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది.
భౌతిక పరిశీలన కూడా నిర్వహించాం
క్రీడా సర్టిఫికెట్ల ధృవీకరణ పూర్తయిన తర్వాత అభ్యర్థుల అసలు పత్రాల భౌతిక పరిశీలనను 1:5 నిష్పత్తిలో నిర్వహించినట్లు శాప్ తెలిపింది. తొలిసారిగా ప్రాథమిక మెరిట్ జాబితాను ఆన్లైన్లో విడుదల చేసి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించినట్లు పేర్కొంది. అందిన అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చోట మళ్లీ ధృవీకరణ చేపట్టి తుది జాబితాను సిద్ధం చేసినట్లు వివరించింది. సీనియర్ అధికారులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీ మొత్తం నియామక ప్రక్రియను సమీక్షించినట్లు తెలిపింది.
క్రీడా రికార్డులు, సంబంధిత ఫెడరేషన్ల ధృవీకరణలు, స్క్రీనింగ్ కమిటీ నివేదికలు, అభ్యంతరాల పరిష్కార వివరాలను పరిశీలించిన అనంతరం తుది ఎంపిక జాబితాకు ఆమోదం తెలిపినట్లు శాప్ వెల్లడించింది. జనన తేదీ వివాదంపై వచ్చిన ఆరోపణలకూ శాప్ వివరణ ఇచ్చింది. త్రీమికట్ల వెంకట లక్ష్మి కేసులో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు తెలిపింది. అభ్యర్థి సమర్పించిన ఎస్ఎస్సీ, పాఠశాల రికార్డులు, ఆధార్ తదితర అధికారిక పత్రాల్లో జనన తేదీ ఒకే విధంగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది.
సంబంధిత వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ కూడా క్రీడా సర్టిఫికెట్ నిజస్వరూపాన్ని ధృవీకరించిందని తెలిపింది. విజయనగరం జిల్లా పోలీస్ శాఖ కూడా ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసినట్లు శాప్ వెల్లడించింది. మొత్తం ఎంపిక ప్రక్రియ ధృవీకరించబడిన జాతీయ స్థాయి క్రీడా ప్రతిభ ఆధారంగానే జరిగిందని శాప్ స్పష్టం చేసింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది.
