శ్రీగురుధామ్ ధర్మక్షేత్రం రాష్ట్రాలకు ఆదర్శం…

  • తెలంగాణ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి
  • శ్రీగురుధామ్ లో వైభవంగా సద్గురు సేవా పురస్కారాలు

జగ్గయ్యపేట , ఆంధ్రప్రభ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఆదర్శంగా ఆధ్యాత్మికంగా గురుధామ్ ధర్మక్షేత్రం నిలుస్తున్నట్లు తెలంగాణ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామ సమీపంలోని శ్రీ గురుధామ్ ధర్మక్షేత్రంలో శ్రీ శివానంద ఎమనెంట్ సిటిజన్ అవార్డు పురస్కారాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

ప్రముఖ తాత్వికులు శివశ్రీ గెంటేల వెంకటరమణ వసంతలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన ఆంకాలజిస్ట్ డాక్టర్ సికె నాయుడు, విజయవాడ ఆర్కే ఆసుపత్రికి చెందిన ఆర్.ఈశ్వర్, జగ్గయ్యపేట శ్రీరామ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ బి.యోగిరాంలకు జరిగిన సేవా పురస్కార కార్యక్రమంలో తెలంగాణ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… తనకు చిరకాలంగా పరిచయం ఉన్న శ్రీగురుధామ్ ధర్మక్షేత్రంలో జరిగే సేవా కార్యక్రమాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

గెంటేల వెంకటరమణ మాట్లాడుతూ… దేశసేవాహితంగా జరుగుతున్న మంచిని గుర్తించి సమాజానికి గుర్తు చేయడానికి సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తారు అన్నారు.

సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. ఒక గురుధామ్ లోనే అందరం రాజకీయాలకతీతంగా ఒక తల్లి పిల్లలుగా కలిసి పోతామని అన్నారు.

సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ… ఉన్నతమైన ఉద్దేశంతో జరిగే ఈ సత్కార్య కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

భీమిలి నుండి విచ్చేసిన సద్గురు శ్రీ శివానందమూర్తి అను యయులు రాఘవేంద్రన్ మాట్లాడుతూ… ఆధ్యాత్మికతను కూడా సేవలో విడుదల చేయడం మనకు శ్రీ గురుధామ్ లోనే స్పష్టంగా తెలుస్తుంది అన్నారు.

కార్యక్రమంలో వారితోపాటు భీమిలి నుంచి విచ్చేసిన రాధాకుమారి, విజయవాడ వైద్యులు విఎస్ఎన్ రావు, ఎన్ శ్రీనివాసరావు, ఢిల్లీ నుండి వచ్చిన వెంకటేశ్వరరావు లకు సత్కారాలు జరిగాయి.

సిరివెన్నెల కవితా గానం సిడి ఆవిష్కరణ..

దివంగత పాటలు రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన కవితలను గానంగా స్వరపరిచిన సిడిని జన్మదినోత్సవ సభలో ఆవిష్కరించారు. సిరివెన్నెల తనయుడు యోగేశ్వర్ స్వయంగా స్వరపరిచి గానం చేసిన ఈ సి డి ఆవిష్కరణలో సిరివెన్నెల సతీమణి పద్మావతి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply