మే డే స్ఫూర్తితో లేబర్ కోడ్‌ల రద్దుకు ఉద్యమించాలి

నర్సంపేట, ఆంధ్రప్రభ : మే 1న జరిగే మే డేను జయప్రదం చేయాలని, మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం ఉద్యమించాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపునిచ్చారు.
నర్సంపేట వ్యవసాయ గ్రేట్ మార్కెట్ యార్డులో ఆదివారం హమాలీ కార్మికుల సమావేశం నిర్వహించారు. హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోనె యువరాజు మాట్లాడారు.
దేశంలో కార్పొరేట్, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా కార్మిక చట్టాలలో సవరణలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. 8 గంటల పని విధానం కోసం అనేక మంది కార్మికులు చేసిన త్యాగాల ఫలితంగానే ప్రస్తుత హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు. కార్మికుల హక్కులను రక్షించేందుకు వచ్చిన చట్టాలను తొలగించడం సరికాదని అన్నారు.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయవద్దని అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్, హమాలీ డివిజన్ అధ్యక్షుడు బొల్లం ప్రసాద్, నాయకులు గాండ్ల రాములు, బిక్షపతి, అనిల్ కుమార్, స్వామి, మొగిలి, దేవేందర్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
