మిస్సింగ్ కేసుల ఛేదనలో స్మార్ట్ టెక్నాలజీ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ ; కనిపించకుండా పోయిన వ్యక్తులను గుర్తించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మిస్సింగ్ కేసుల ఛేదనలో కర్నూలు పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సర్వీసుల ఆధ్వర్యంలో సుమారు 15 వేల అనలిటిక్స్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 722 మ్యాట్రిక్స్ స్మార్ట్ టెక్నాలజీ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.
ఈ కెమెరాల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS), ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వంటి సాంకేతిక వ్యవస్థలు అమల్లో ఉన్నాయని తెలిపారు. అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కంట్రోల్ రూమ్ నుంచి CCTNS AP 360 యాప్ సహాయంతో వీటిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ స్టేషన్లతో ఈ వ్యవస్థ అనుసంధానమై ఉందన్నారు.
ఇటీవల కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసులో కనిపించకుండా పోయిన వ్యక్తిని మదనపల్లిలో గుర్తించినట్లు తెలిపారు. అలాగే పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో బాధితుడిని తిరుపతిలో, నందవరం పోలీస్ స్టేషన్ కేసులో వ్యక్తిని విజయవాడలో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు.
FRS టెక్నాలజీ ద్వారా మిస్సింగ్ వ్యక్తుల ఆచూకీ కోసం వేగవంతమైన చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. ఈ కెమెరాలు వ్యక్తుల ముఖాలను స్కాన్ చేసి పోలీసుల డేటాబేస్‌లోని ఫోటోలతో సరిపోల్చి గుర్తిస్తాయని వివరించారు.
అదేవిధంగా ప్రాపర్టీ నేరస్థులు, పరారీలో ఉన్న నిందితులు, నేరచరిత్ర కలిగిన వ్యక్తుల అనుమానాస్పద కదలికలపై కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తక్షణ అలర్ట్‌లు అందుతున్నాయని తెలిపారు. మిస్సింగ్ వ్యక్తుల గుర్తింపు, నేరస్థుల ట్రాకింగ్, దొంగిలించిన వాహనాల గుర్తింపులో ఈ టెక్నాలజీ కీలకంగా ఉపయోగపడుతోందన్నారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, దేవాలయాలు, మసీదులు, స్టేడియాలు, మార్కెట్ యార్డులు, రద్దీ ప్రాంతాలు, ట్రాఫిక్ జంక్షన్లలో ఈ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు.కుటుంబ సభ్యులు లేదా వాహనాలు కనిపించకుండా పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని తక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
