Smart Special | తెలంగాణ‌లో విలీన‌మైతే.. ఆ ప‌ల్లెలకు ప్ర‌గ‌తి బాట‌!

ఆంధ్ర నుంచి వేరు చేయాల‌ని విన‌తి
ఎన్నో ఏళ్లుగా ఏజెన్సీ వాసులు ఎదురు చూపు!
ఎన్నిక‌ల స‌మ‌యంలో తెర‌పైకి విలీన అంశం
ఆ త‌ర్వాత మ‌రుగున ప‌డుతున్న వైనం!

భద్రాచలం, ఆంధ్ర‌ప్ర‌భ :
భ‌ద్రాచ‌లం ఏజెన్సీకి చెందిన ఐదు గ్రామాలను రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విలీనం చేశారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో నిర్ల‌క్ష్యానికి గురైన ఈ ఐదు గ్రామాలు ప్ర‌గ‌తి బాట‌లో ప‌య‌నించాలంటే తెలంగాణ‌లో విలీనం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయా గ్రామ‌స్థులు కోరుతున్నారు. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో తెర‌పైకి తీసుకొస్తున్న ఈ అంశాన్ని ఎన్నిక‌ల అనంత‌రం మ‌రుగున ప‌డుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ గ్రామాల ప్ర‌జ‌ల కోరిక మాత్రం నెర‌వేర‌డం లేదు.

విలీన‌మైన గ్రామాలు ఇవే…

రాష్ట్ర విభజన సమయంలో గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకల పాడు, పురుషోత్తం పట్నం ఆంధ్రలో విలీనం చేశారు. పోలావ‌రం ప్రాజెక్టు విష‌యంలో ఇబ్బందులు లేకుండా ఈ ఐదు గ్రామాల‌ను భ‌ద్రాచ‌లం నుంచి వేరు చేసి ఆంధ్ర‌లో క‌లిపారు. అయితే త‌మ‌కు అన్ని అనుకూలంగా తెలంగాణ ప్రాంతం ఉంద‌ని, అలాగే అభివృద్ధికి కూడా నోచుకోవ‌డం లేద‌ని ఆయా గ్రామ‌స్థులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ గ్రామాల‌ను తెలంగాణలో విలీనం చేయాల‌ని గ‌త కొన్ని సంవ‌త్సరాలుగా వారు కోరుతున్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో…

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల ముందు 2023లో బీఆర్ఎస్ ఈ గ్రామ‌స్థుల కోరిక‌ను ఒక అంశంగా తెరపైకి తెచ్చింది. ఆ ఐదు గ్రామాల‌ను తెలంగాణ‌లో విలీనం చేయాల‌ని కోరింది. ఎన్నికల తర్వాత ఆ విషయం మరుగున పడింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు సైతం ఈ విషయంపై అనేక హామీలు గుప్పించారు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా ప‌ట్టించుకోలేదని ఆయా గ్రామ‌స్థులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బ‌హుశ తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి స‌న్నిహితంగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండ‌డం వ‌ల్ల ఈ అంశాన్ని ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన భ‌ద్రాచ‌లం
రాష్ట్ర విభజనతో భద్రాచలం ప‌ట్ట‌ణానికి కష్టకాలం మొదలైంది. గతంలో అత్యంత పెద్దగా ఉన్న భద్రాచలం నియోజకవర్గం కుదించుకుపోయింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న వి.ఆర్పురం, కూనవరం, చింతూరు, ఎటపాక వంటి ప్రాంతాలు ఆంధ్రాలో కలిసిపోయాయి. జిల్లాల విభజనతో భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న వాజేడు, వెంకటాపురం మండలాలను ములుగు జిల్లాలో చేర్చారు. ఈ క్రమంలో పేరుకు భద్రాచలం నియోజకవర్గం అయినప్పటికీ అక్కడి ప్రజలు తమతమ అవసరాల కోసం ములుగు జిల్లా ప్రధాన కేంద్రానికి వెళ్లడానికి అలవాటు పడ్డారు. దీంతో భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణం వ్యాపారులు వాణిజ్య‌ప‌రంగా దెబ్బ‌తినారు. మరోవైపు పోలవరం బ్యాక్ వాటర్ దెబ్బకు ప్రతి సంవత్సరం భద్రాచల పట్టణం రెండు నుంచి మూడు నెలల పాటు నీటమయ‌మ‌వుతుంది.

విన‌తుల వెల్లువ‌
తెలంగాణ‌లోకి ఐదు గ్రామపంచాయతీలను తక్షణం విలీనం చేయాలని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖ రాశారు. ప్రజల భావోద్వేగాలు, రాజ్యాంగ పరంగా కూడా ఈ గ్రామాల విలీనాన్ని వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, న్యాయ నిపుణులను ఒక్కటిగా చేసి ఈ విలీనం అవసరమని బలంగా వాద‌న వినిపించారు. గతంలో కూడా సీపీఎం, సీపీఐ లు ఇదే విషయమై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాయి. అయితే ఏ పార్టీ కూడా ఈ విషయంపై చివరిదాకా పోరాటం చేస్తున్న దాఖలాలు క‌నిపించ‌డం లేవు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి ఐదు గ్రామాల‌ను తెలంగాణ‌లో విలీనం చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

Leave a Reply