ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండల కేంద్రంలోని చేంగల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ దుమాల మమత (రాజు) హాజరై, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుమాల మమత (రాజు) మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విలువలతో కూడిన విద్యతో పాటు ఉచిత యూనిఫాం, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, ఆటల పట్ల ప్రత్యేక శిక్షణ, అనుభవం గల ఉపాధ్యాయులు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు ఇకపై ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలోనే అడ్మిషన్లు చేయించాలని కోరారు.
ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని విధాల సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తున్నందున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాతి మోహన్ గౌడ్, పాలకవర్గ సభ్యులు, అమ్మ ఆదర్శ ఉపాధ్యాయ బృందం, పాఠశాల కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

