దేవున్‌పల్లి లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు

దేవున్‌పల్లి లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు

భీమ్‌గల్‌ రూరల్ , ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మండలంలోని దేవున్‌పల్లి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలోని వడ్డెర కాలనీలో నిర్వహించిన లక్ష్మీ నరసింహ స్వామి అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, వాటి బదులు స్టీల్ ప్లేట్లను ఉపయోగించడం ప్రారంభించారు. ఈ చర్య గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఒక మంచి ఆరంభంగా నిలిచింది.అన్నదాన కార్యక్రమానికి హాజరైన భక్తులకు స్టీల్ ప్లేట్లలోనే భోజనం వడ్డించడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించి, భవిష్యత్తులో గ్రామంలోని అన్ని సామూహిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లకావత్ శేఖర్ మాట్లాడుతూ, దేవున్‌పల్లి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఉపసర్పంచ్ బోండ్ల సాయిలు మాట్లాడుతూ, గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమంలో స్టీల్ పాత్రల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.

గ్రామ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, భవిష్యత్తులో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా దేవున్‌పల్లి గ్రామం పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ బొడ్డు గంగారం, భూక్య సురేష్, భీమా నాయక్, గ్రామ కార్యదర్శి సురేష్ , గ్రామ పెద్దలు ,కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply