గుడిసెలు లేని గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం: సురేందర్‌రెడ్డి
బిక్కనూర్, ఆంధ్రప్రభ : గుడిసెలు లేని గ్రామాలుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు ఇటిక్యాల సురేందర్‌రెడ్డి అన్నారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ, ఇళ్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. లబ్ధిదారులు సకాలంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం దశలవారీగా రూ.5 లక్షలు జమ చేస్తుందని తెలిపారు. రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇందుకోసం గ్రామాల్లో గుడిసెల్లో నివసిస్తున్న వారి వివరాలను అధికారులు సేకరించాలని సూచించారు.
అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసిందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కూడా అవసరమైన నిధులు మంజూరు చేస్తోందని సురేందర్‌రెడ్డి తెలిపారు.
