Kurnool-Gun-Firing : క‌ర్నూలులో గ‌న్ క‌ల్చ‌ర్ Andhra Prabha Crime Story

Kurnool-Gun-Firing : క‌ర్నూలులో గ‌న్ క‌ల్చ‌ర్ Andhra Prabha Crime Story

  • బ్యాడ్మింటన్ కోర్టులో తుపాకీ గ‌ర్జ‌న
  • పేకాట లెక్కల్లో డిష్యూం డిష్యూం
  • వెలుగులోకి కొత్త కోణాలు*
  • లైసెన్స్ గన్‌తో గాల్లోకి మూడు రౌండ్లు
  • క్లబ్బుల్లో అక్రమాలపై ప్రశ్నలు

( కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ).

సాధారణంగా క్రీడా మైదానం అంటే చప్పట్లు, కేరింతలు, గెలుపు–ఓటముల ఉత్కంఠ, క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా నిలిచే వేదిక. కానీ కర్నూలు నగరంలో జరిగిన కర్నూల్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ పోరు ఒక్కసారిగా తుపాకీ మోతలతో భయానక వాతావరణంగా మారింది. వందలాది మంది ప్రేక్షకుల సమక్షంలో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలుత ఇది కేవలం ఓటమి ఆవేదనతో జరిగిన ఘటనగా పోలీసులు వెల్లడించినప్పటికీ, దీని వెనుక మరో కోణం కూడా ఉందన్న ప్రచారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Kurnool-Gun-Firing : అప‌లు ఏం జరిగింది?

ఆదివారం సాయంత్రం జోహారాపురం సమీపంలోని బ్యాడ్మింటన్ కేంద్రంలో కర్నూల్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. కొంతమంది ముఖ్య అతిథిగా పాల్గొనగా, పలువురు వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు హాజరయ్యారు.
ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్‌కు చెందిన జట్టు ఫైనల్‌లో ఓటమి చెందింది. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆయన తన వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్‌తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

Kurnool-Gun-Firing : ఒక్కసారిగా భయాందోళన

కాల్పుల శబ్దాలు వినిపించగానే మైదానంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ముఖ్య అతిథిపై దాడి జరిగిందేమోనన్న అనుమానంతో నిర్వాహకులు, ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. చిన్నారులు, మహిళలు, క్రీడాకారులు తలోదిక్కుకు పరుగులు తీశారు. కొన్ని నిమిషాల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత ఎవరినీ లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపలేదని, గాల్లోకే కాల్పులు జరిగినట్లు స్పష్టమవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Kurnool-Gun-Firing : పోలీసుల స్పందన

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కౌశిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రాఘవేంద్ర మాట్లాడుతూ, జట్టు ఓటమిని తట్టుకోలేక గాల్లోకి కాల్పులు జరిపినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా వ్యవహరించినందుకు ఆయుధ లైసెన్సు రద్దు చేసేందుకు కూడా చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.

Kurnool-Gun-Firing : ఓటమే కారణమా?

పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం కాల్పులకు కారణం జట్టు ఓటమిపై వచ్చిన ఆవేశమే. అయితే నగరంలో మరో చర్చ కూడా జోరుగా సాగుతోంది. సంఘటన జరిగిన బ్యాడ్మింటన్ కేంద్రంలో క్రీడా పోటీలతో పాటు అక్రమంగా పేకాట కూడా కొనసాగుతోందని, ఉదయం నుంచి జరిగిన పేకాటలో భారీ మొత్తంలో డబ్బు కోల్పోవడం వల్లే ఆవేశానికి గురై కాల్పులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. ఈ అంశంపై దర్యాప్తు ద్వారా మాత్రమే వాస్తవాలు తేలాల్సి ఉంది.