ఖబర్దార్ కేటీఆర్.. ఖమ్మం గడ్డపై నీ రాజకీయ జిమ్మిక్కులు నడవవు
ఖబర్దార్ కేటీఆర్.. ఖమ్మం గడ్డపై నీ రాజకీయ జిమ్మిక్కులు నడవవు
రాష్ట్ర మంత్రులపై బురదజల్లే ప్రయత్నాలు మానుకో : డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : పాలేరు సభ వేదికగా రాష్ట్ర మంత్రులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాడిందే పాడరా.. పాచిపండ్ల దాసరా” అన్నట్లుగా పదే పదే అబద్ధాలు చెబితే నిజాలు మారవని మండిపడ్డారు. తెలంగాణ యాసలో మాట్లాడితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలు మరిచిపోతారని భావించడం భ్రమేనని పేర్కొన్నారు.
పదేళ్ల పాలనలో స్కీముల పేరుతో స్కాములు
మట్టి గుట్టలకు, రోడ్లకు రైతుబంధు నిధులు మళ్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదా అని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల భూములకు కూడా రైతుబంధు చెల్లించిన విషయం ప్రజలకు తెలుసన్నారు. స్కీముల పేరుతో స్కాములు చేసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందీ, ధరణి పేరుతో వేల ఎకరాల భూములపై దందాలు నడిపిందీ బీఆర్ఎస్ పాలనేనని ఆరోపించారు. మాటల గారడీలో నైపుణ్యం ఉన్నా ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువ అంచనా వేయొద్దని కేటీఆర్‌కు సూచించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఆర్థిక విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల మధ్యే ముగ్గురు మంత్రులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులని సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజాదర్బార్ల ద్వారా వేలాది సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్న తీరును చూసి ఓర్వలేకే కేటీఆర్ విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు ఇప్పటికే తీర్పు చెప్పారు
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే కలలు కనడం మానుకోవాలని, తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఆ పార్టీకి తగిన తీర్పు ఇచ్చారని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలన్న కేటీఆర్ ఆశలు నెరవేరవని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చి అడ్డగోలు ప్రసంగాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. “చూసుకో.. కాచుకో.. నీ రాజకీయ జిమ్మిక్కులు ఇక్కడ నడవవు.. ఖబర్దార్ కేటీఆర్” అంటూ హెచ్చరించారు.
