అజయ్‌బాబు విజయం విజయనగరానికే గర్వకారణం
- కామన్వెల్త్ విజేత అజయ్‌ను ఫోన్లో అభినందించిన మంత్రి కొండపల్లి
- తండ్రి శ్రీనివాసరావుకు సన్మానం
విజయనగరం, ఆంధ్రప్రభ : కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన విజయనగరం జిల్లాకు చెందిన వల్లూరి అజయ్‌బాబు భవిష్యత్తులో మరిన్ని పతకాలతో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడకు చెందిన వల్లూరి అజయ్‌బాబు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంతో రజత పతకం గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో అజయ్‌బాబు తండ్రి, 2010 ఢిల్లీ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన వల్లూరి శ్రీనివాసబాబును తన క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మతో కలిసి సన్మానించి అభినందించారు.

మంత్రి అజయ్‌బాబుతో వీడియో కాల్‌లో మాట్లాడి అభినందించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలతో విజయనగరం జిల్లాకు రాష్ట్ర, దేశస్థాయిలో పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనకు సన్నిహితుడు అయిన వల్లూరి శ్రీనివాసరావు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వందల మందికి శిక్షణ ఇచ్చి విజేతలుగా మలిచారని.. ఇప్పుడు ఆయన తనయుడు కూడా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని కామన్వెల్త్‌తో పతకం సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. నాడు తండ్రి .. నేడు తనయుడు ఇద్దరూ విజయనగరం పేరు విశ్వక్రీడా వేదికపై చిరస్థాయిగా నిలిచేలా చేశారని మంత్రి కొనియాడారు.
