నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి
సైబర్, గల్ఫ్ మోసాలపై అవగాహన కల్పించాలి..
సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి
రుద్రంగి, ఆంధ్రప్రభ : నేరాల నియంత్రణకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అధికారులను ఆదేశించారు.
బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించారు.
ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై కూడా ఆరా తీశారు. కేసుల విచారణలో త్వరితగతిన దర్యాప్తు చేపట్టడంతో పాటు సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.
పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందని ఎస్పీ అభినందించారు. నేరాలు, నేరస్తుల సమాచార వ్యవస్థలో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులను సిబ్బంది అందిపుచ్చుకోవాలని సూచించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైబర్ మోసాలు, గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వీసా మోసాలు, నకిలీ ఏజెంట్ల మోసాలు, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తూ ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలిపారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, వాటి ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని ఎస్పీ తెలిపారు.
ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్ఐ మోతీలాల్, సిబ్బంది పాల్గొన్నారు.
