అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్..!
44 ద్విచక్ర వాహనాలు స్వాధీనం..!
ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్, నిర్మల్, ఇచ్చోడ, నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో బైక్‌లను దొంగిలిస్తూ హడలెత్తిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసి, చోరీకి గురైన 44 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు బుధవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ ఈ ముఠా పార్కింగ్‌లో ఉన్న బైక్‌లను వరుసగా దొంగిలిస్తున్నట్లు తెలిపారు.
ఇచ్చోడ మండలం చించోలి గ్రామానికి చెందిన మారంపెళ్లి అనిల్, షేక్ షబ్బీర్ మహమ్మద్, కేశవపట్నం గ్రామానికి చెందిన షేక్ ముస్తాషాహిద్, సిరికొండకు చెందిన మహమ్మద్ జాకీర్, మహమ్మద్ షఫీ ఐదుగురు నిందితులు పార్కింగ్‌లో ఉన్న మోటార్ బైక్‌లను దొంగిలించి రహస్యంగా విక్రయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ద్విచక్ర వాహనాల దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేయడంతో ముఠా గుట్టు రట్టయిందన్నారు. సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల మేరకు ఈ నెల 6న ఇచ్చోడలోని శుభాష్‌నగర్ కాలనీకి చెందిన ధరాడే బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన కేశవపట్నం గ్రామానికి చెందిన ముజాహిద్, గుండాలకు చెందిన ఇక్బాల్, కేశవపట్నంకు చెందిన కరీంను కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసినందుకు ముగ్గురిని అరెస్టు చేయగా, మిగిలిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఇచ్చోడ పోలీసులు సాంకేతిక ఆధారాలతో చాకచక్యంగా దర్యాప్తు చేసి అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను పట్టుకుని 44 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఇచ్చోడ ఎస్హెచ్ఓ కె. నరేష్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
