తహసీల్దార్ కార్యాలయం ముందు..
పురుగుల మందు తాగిన రైతు
భూ వివాదంపై మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం..
ఆస్పత్రికి తరలింపు
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : మండలంలోని కదంబాపూర్ గ్రామానికి చెందిన రైతు గోస్కుల రవీందర్ తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. కదంబాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 264లో రవీందర్‌కు 20 గుంటల పట్టా భూమి ఉంది. పక్కనే చింతల రాఘవరెడ్డికి చెందిన 246, 249, 250 సర్వే నంబర్లలోని భూములు ఉన్నాయి.
గతంలో ఈ రెండు భూముల మధ్య నక్ష ప్రకారం దారి ఉందని రాఘవరెడ్డి ఆర్ఎస్ఐ, డీఐలకు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు కొలతలు నిర్వహించి నక్షలో ఉన్న దారిని ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు.
దీంతో రాఘవరెడ్డి దారిలో మట్టి పోస్తుండగా రవీందర్ అడ్డుకోవడంతో కేసు కూడా నమోదైనట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ అధికారుల రికార్డుల ప్రకారం అక్కడ దారి ఉందని తహసీల్దార్ కూడా వివరించినట్లు సమాచారం.
అయినప్పటికీ రవీందర్ ఆ భూమి తనదేనంటూ వాదిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగాడు. దీంతో అక్కడున్న వారు వెంటనే అతడిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
