సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా చీలాపూర్‌లో సీసీ కెమెరాల ప్రారంభం
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు కీలకం..
అదనపు డీసీపీ కుశాల్కర్
బెజ్జంకి, ఆంధ్రప్రభ : గ్రామాల్లో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణకు సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని అదనపు డీసీపీ కుశాల్కర్ పేర్కొన్నారు.
సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా బెజ్జంకి మండలంలోని చీలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను అదనపు డీసీపీ కుశాల్కర్, సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే ముఖ్యమైన కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాల దృశ్యాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో భయం ఏర్పడుతుందని, తద్వారా నేరాల నియంత్రణకు మరింత దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
సురక్ష నేత్ర కార్యక్రమం ద్వారా ప్రజలు, పోలీసుల భాగస్వామ్యంతో గ్రామాల్లో భద్రతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించి, గ్రామ భద్రతలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శానగొండ స్వరూప, పోలీసు అధికారులు, సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
