చేయూత పింఛన్లకు కొత్త దరఖాస్తులు..

  • ఆగస్టు 31లోగా స్వీకరించాలి
  • రెండు వారాల్లో ఫామ్‌ పాండ్లు పూర్తి చేయాలి
  • భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకం కింద అర్హులైన కొత్త లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, వైద్య, ఎక్సైజ్‌ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పింఛన్ల దరఖాస్తులు, జలసిరి పనులు, ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు.

సెర్ఫ్‌ సర్క్యులర్‌ ప్రకారం పింఛన్ల అర్హతలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తు విధానంపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్‌ వార్డు అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, తలసేమియా, సికిల్‌సెల్‌, హీమోఫీలియా, డయాలసిస్‌ బాధితులు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ఇప్పటికే ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌, గ్రీవెన్స్‌ కార్యక్రమాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. గతంలో దరఖాస్తు చేయని వారు, పత్రాలు సమర్పించని వారు, కొత్తగా అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆగస్టు 31లోగా దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి,ఎంపీడీఓ కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారి,మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు.

ఆధార్‌, వయస్సు ధ్రువీకరణ, రేషన్‌కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ, బ్యాంకు పాస్‌బుక్‌, ఫొటోతో పాటు సంబంధిత పింఛన్‌ వర్గానికి అవసరమైన ప్రత్యేక ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. అన్ని ఎంపీడీఓ, మున్సిపల్‌ కార్యాలయాల్లో చేయూత హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి దరఖాస్తుదారులకు సహాయం అందించాలని తెలిపారు.

రెండు వారాల్లో ఫామ్‌ పాండ్లు పూర్తి చేయాలి:

జలసిరి కింద చేపట్టిన ఫామ్‌ పాండ్ల నిర్మాణ పనులను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఎంపీడీఓలు, ఏపీఎంలను కలెక్టర్‌ ఆదేశించారు. లక్ష్యం మేరకు అనువైన స్థలాలను గుర్తించి అంచనాలు సిద్ధం చేసి మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలు, పెర్కొలేషన్‌ ట్యాంకులు, కమ్యూనిటీ సోక్‌పిట్స్‌, బోర్‌వెల్‌ రీచార్జ్‌ పనులను కూడా ప్రారంభించాలన్నారు.

ప్రతి సోమవారం మండలాల్లో ప్రజావాణి

ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని కలెక్టర్‌ తెలిపారు. ఎంపీడీఓ నోడల్‌ అధికారిగా వ్యవహరించాలని, అన్ని శాఖల మండలస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అర్జీల నమోదు కోసం హెల్ప్‌డెస్క్‌, రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌, డేటా ఎంట్రీ సదుపాయం ఏర్పాటు చేయాలని, ప్రజలకు తాగునీరు, కుర్చీలు, దివ్యాంగులకు వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, ఎక్సైజ్‌ ఈఎస్‌ కిరణ్‌, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ వెంకటరత్నం, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.