Srisailam | భక్తుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయాలు

  • అర్జిత అభిషేకాలు నిలుపుదల
  • 19 రోజుల పాటు అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేత..
  • రాత్రివేళల్లో మాత్రమే పరిమితంగా స్పర్శ దర్శనం

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 12 వరకు శ్రావణమాసోత్సవాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు.
ఈ శ్రావణమాసోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రావణ మాసంలో శ్రీశైలం ఆలయాన్ని సందర్శిస్తారని తెలిపారు.

ఉత్సవాల సందర్భంగా భక్తులకు వసతి సౌకర్యాలు, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, సాధారణ రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్ల అర్జిత సేవలు, అన్నప్రసాదాల వితరణ, పారిశుద్ధ్య నిర్వహణ, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

స్పర్శ దర్శనానికి పరిమిత భక్తులకే అనుమతి..

సామాన్య భక్తుల సౌకర్యార్థం శ్రావణ శనివారాలు, ఆదివారాలు, సోమవారాలు, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి తదితర రోజుల్లో మొత్తం 19 రోజుల పాటు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవలను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజుల్లో రాత్రి వేళలో మాత్రమే పరిమితంగా స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు.

ఆగస్టు 18, సెప్టెంబరు 1, సెప్టెంబరు 8 తేదీల్లో వచ్చే మంగళవారాల్లో ఉదయం వేళల్లో గర్భాలయ అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మాసంలోని మిగిలిన సాధారణ రోజుల్లో గర్భాలయ అర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే ప్రతిరోజూ వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఉభయ దేవాలయాల్లో ఉదయం 4.30 గంటల నుంచి మహా మంగళహారతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

మహా మంగళహారతుల ప్రారంభం నుంచే అంటే ఉదయం 4.30 గంటల నుంచే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుందని వెల్లడించారు.

తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించి, మంగళ వాయిద్యాలు, ప్రదోషకాల పూజలు, సుసంధ్య సేవ అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి మహా మంగళహారతులు ప్రారంభిస్తామని తెలిపారు. మహా మంగళహారతుల ప్రారంభం నుంచే అంటే సాయంత్రం 5.30 గంటల నుంచి దర్శనాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

శ్రావణ మాసంలో భక్తుల సౌకర్యార్థం మూడు పర్యాయాలు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రావణ రెండో శుక్రవారం ఆగస్టు 21న, శ్రావణ మూడో శుక్రవారం ఆగస్టు 28న, నాలుగో శుక్రవారం సెప్టెంబరు 4న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఉచిత వరలక్ష్మీ వ్రతంలో ఒక్కో పర్యాయానికి 1500 మంది భక్తులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. రెండో పర్యాయంలో ప్రత్యేకంగా 1000 మంది శివసేవకులకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
మూడో పర్యాయంలో ప్రత్యేకంగా 750 మంది చెంచు ముత్తైదువులకు, 750 మంది ఇతర ముత్తైదువులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులందరికీ ప్రసాదాలతో పాటు చీర, రవిక వస్త్రం, గాజులు, పసుపు కుంకుమలు, కైలాస కంకణాలు, శ్రీశైల ప్రభ మాసపత్రిక, వృక్ష ప్రసాదంగా దేవతా వృక్షాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. వ్రతకర్తలకు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించడంతో పాటు అన్నప్రసాద వితరణ భవనంలో భోజన ప్రసాదం అందజేస్తామని తెలిపారు. వ్రతకర్తలను అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్‌లోని భక్తులకు నిరంతరం మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం అందజేయనున్నట్లు తెలిపారు. ఉదయం వేళల్లో వేడి పాలు కూడా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు శ్రావణ మాసంలో రద్దీ రోజులలో కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించినట్లు తెలిపారు. రద్దీ రోజుల్లో దాదాపు కార్యాలయ సిబ్బంది మొత్తం ప్రత్యేక విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ భవనంలో ఉదయం 10.30 గంటల నుంచి అన్నప్రసాదాలు అందజేస్తామని తెలిపారు. అలాగే రాత్రి 7 గంటల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ధర్మప్రచారంలో భాగంగా శ్రావణ మాసంలో అఖండ శివభజనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను భక్తులు వినియోగించుకోవాలని వారు కోరారు.