కోదాడలో యూరియా అక్రమ దందాపై ఆరోపణలు.. విచారణ జరపాలి

గోడౌన్‌లో యూరియా డంపింగ్‌..

ఇతర మండలాలకు తరలింపు? రైతులకు కొరత..

వ్యాపారులకు మాత్రం భారీగా సరఫరా ఎలా?

కోదాడ, ఆంధ్రప్రభ : కోదాడ ప్రాంతంలో యూరియా కొరత నెలకొన్న నేపథ్యంలో కొంతమంది ఎరువుల దుకాణాల నిర్వాహకులు యూరియాను అక్రమంగా నిల్వ చేసి, నల్లబజారుకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.

కోదాడ పరిసర ప్రాంతాల్లోని కొన్ని దుకాణాలకు చెందిన యజమానులు యూరియా బస్తాలను డంప్ చేసి, తమ్మర వద్ద సాయిబాబా మందిరం పక్కన ఉన్న ఓ గోడౌన్‌లో నిల్వ చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

అక్కడి నుంచి నేలకొండపల్లి మండలంలోని కొంగర గ్రామానికి చెందిన వారికి సుమారు 250 బస్తాల యూరియాను తరలించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

మరోవైపు యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు రావెళ్ల కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి ఓ రైతుకు యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవాలని సూచించి, ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండగా, ఒక ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు ఏకంగా 2,000 బస్తాల యూరియా ఎలా అందుబాటులోకి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందకుండా కొరత సృష్టించి, కొంతమంది వ్యాపారులు అక్రమంగా నిల్వలు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఈ అక్రమ దందా వెనుక ఎరువుల దుకాణాల నిర్వాహకులు, వ్యవసాయ శాఖకు చెందిన కొంతమంది అధికారుల కుమ్మక్కు ఉందనే ఆరోపణలను రైతులు చేస్తున్నారు.

యూరియా నిల్వలు, విక్రయాలు, డీలర్లకు కేటాయింపులు, ఇతర ప్రాంతాలకు జరిగిన తరలింపుపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి రికార్డులను పరిశీలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతుల అవసరాలను పక్కనబెట్టి అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలు, పక్కదారి సరఫరా జరిగితే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ ఆరోపణలపై వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని రైతులు, రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.