రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరగాలి
రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరగాలి
చోదిమెళ్ల రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు ఆంధ్రప్రభ రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం ఏలూరు మండలం చోదిమెళ్ల గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీఏఐఎంఎస్ 2.0 (APAIMS 2.0) వెబ్సైట్ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. రైతుల ఈ-క్రాప్ నమోదు వివరాలు, ఆధార్ అనుసంధానం, రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల కేటాయింపు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైతు ఆధార్ నంబర్ నమోదు చేసిన అనంతరం ఓటీపీ ధృవీకరణ ద్వారా పంట విస్తీర్ణం, పంట వివరాల ఆధారంగా యూరియా, డీఏపీ ఎరువులు దఫాల వారీగా కేటాయిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఏపీఏఐఎంఎస్ 2.0 ద్వారా రైతులు తమకు కేటాయించిన ఎరువులను సులభంగా పొందవచ్చని, మొబైల్ నంబర్ నవీకరణ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు.
గత ఏడాది ఈ-క్రాప్‌లో నమోదు చేసిన రైతుల వివరాలు ఏపీఏఐఎంఎస్ 2.0 వెబ్సైట్లో సక్రమంగా నమోదయ్యాయా లేదా, రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులు తనిఖీ చేశారా లేదా, రైతులు కొనుగోలు చేసే దుకాణాలను వెబ్సైట్లో అనుసంధానం చేశారా లేదా అనే అంశాలను కలెక్టర్ పరిశీలించారు.
చోదిమెళ్ల గ్రామ రైతుల ఎరువుల అవసరాలకు అనుసంధానమైన శనివారపుపేట సొసైటీ లాగిన్‌లో రైతుల ఆధార్ నంబర్లను నమోదు చేసి, వారి పంట నమోదు వివరాలను పరిశీలించారు. పంట ఆధారంగా యూరియా, డీఏపీ బస్తాలను ఆన్లైన్ ద్వారా రైతులకు కేటాయించే విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
రైతు ఆధార్ నంబర్ నమోదు చేసిన తర్వాత ఓటీపీ ధృవీకరణ ద్వారా రైతు సాగు చేస్తున్న భూమి విస్తీర్ణం, పంట ఆధారంగా యూరియా, డీఏపీ బస్తాలు మూడు దఫాలుగా కేటాయించబడుతున్నాయని అధికారులు వివరించారు. కేటాయించిన బస్తాలను దఫాల వారీగా రైతులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందన్నారు. సొసైటీ లాగిన్‌లో రైతుల మొబైల్ నంబర్లను నవీకరించుకునే సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు.
ఈ నూతన వ్యవస్థ ద్వారా రైతుల పంట భూమి విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా, డీఏపీ బస్తాలు అందుబాటులో ఉంటాయని, రైతులు ఈ యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం ఎరువుల నిల్వలు, పంపిణీ రికార్డులు, రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందుతున్నాయా అనే అంశంపై ఆరా తీశారు. నాణ్యమైన ఎరువులు అందించడంతో పాటు పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని యూరియా, డీఏపీతో పాటు ఇతర ఎరువుల నిల్వలు తగినంతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ఎరువుల కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా, జిల్లా పరిషత్ సీఈఓ పి. జగదాంబ, తహసీల్దార్ కె. గాయత్రీదేవి, ఏడీఏ అనిల్ కుమారి, మండల వ్యవసాయ అధికారి జీవన సంధ్య, టెక్నికల్ ఏవో వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు కోనేరు వంశీకృష్ణ, సొసైటీ సిబ్బంది, రైతు సేవా కేంద్రం సిబ్బంది, విస్తరణ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
