Shabbir Ali | నోటీసులు జారీ
Shabbir Ali | నోటీసులు జారీ
Shabbir Ali | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రచారంలోకి వచ్చిన ఓ ఆడియో క్లిప్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసినట్లుగా వైరల్ అవుతున్న వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా స్పందించింది.
పార్టీ పదవులు డబ్బులకు అమ్ముడవుతున్నాయంటూ, కాంగ్రెస్‌పై విమర్శలు చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలతో పాటు మహిళలను కించపరిచే అంశాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో పార్టీ అధిష్టానం వివరణ కోరుతూ షబ్బీర్ అలీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ ఆరోపణలపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తన ఆస్తులు, వ్యక్తిత్వం గురించి నిజామాబాద్ ప్రజలకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. చంద్రశేఖర్ రెడ్డిని స్వయంగా షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేర్పించారని గుర్తు చేశారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ఏడాది క్రితం నాటిదని, అది ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇదిలా ఉండగా, షబ్బీర్ అలీ, మహేశ్ కుమార్ గౌడ్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
