ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన పెంపొందించుకోవాలి

- ఇంచార్జీ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్
నెల్లికుదురు, ఆంధ్రప్రభ : ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జీ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు మాట్లాడుతూ… రక్త మార్పిడి, రక్షణ లేని శారీరక సంబంధాలు, ఇంజెక్షన్ సూదుల పునర్వినియోగం వంటి మార్గాల ద్వారా ఎయిడ్స్ వ్యాధి కలుగుతుందన్నారు. చేతులు కలపడం, ఒకే పాత్రలో భోజనం చేయడం, దగ్గరగా కూర్చోవడం వంటి వాటితో హెచ్ ఐ వి సంక్రమణ జరగదని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
సురక్షిత జీవనశైలి, శుభ్రమైన వైద్య పరికరాల వినియోగం, రక్తదానం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపించవదని సూచించారు. ఎయిడ్స్ బాధితులపై వివక్ష నివారణకు విద్యార్థులు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష చూపడం పెద్ద నేరమని, అవగాహన పెంచడం, బాధితులకు మద్దతుగా నిలవడం మన సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. యువతలో చైతన్యం పెరిగితే ఎయిడ్స్ రహిత సమాజం నిర్మించవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కూనా సతీష్, దేశెట్టి యాకన్న అధ్యాపకేతర బృందం ప్రదీప్, గౌరీశంకర్, లక్ష్మణ్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అఖిల్, నితిన్, నవ్య, మౌనిక, మున్నా, శ్రావణి, సౌమ్య, వైష్ణవి, కల్పన, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
