Sensex | లాభాల బాటలో సెన్సెక్స్, నిఫ్టీ..
Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బుధవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బలంగా పుంజుకున్నాయి. ప్రారంభంలో స్వల్ప లాభాలతో మొదలైన ప్రధాన సూచీలు, కొనుగోళ్ల జోరుతో క్రమంగా మరింత ఎగిశాయి. కనిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం మార్కెట్‌కు ఊతమిచ్చింది.
వరుసగా ఆరో రోజూ విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) రూ.1,963 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. దీంతో ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ గణనీయమైన లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు లాభపడి 77,052 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 172 పాయింట్లు పెరిగి 24,054 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 95.55గా నమోదైంది. వ్యక్తిగత షేర్లలో కల్యాణ్ జువెల్లర్స్, స్విగ్గీ, డిక్సన్ టెక్నాలజీస్, ఎటర్నల్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, నాల్కో, పాలీక్యాబ్, సోలార్ ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 540 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 719 పాయింట్లు ఎగసింది. అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగితే మార్కెట్లో సానుకూల ధోరణి కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
