గురుకుల ఇంటర్ ప్రవేశాలకు 6న స్పాట్ కౌన్సిలింగ్
మంథని టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 6న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పెద్దపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ సమన్వయ అధికారి ఉటూరి శ్రీనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు మంథని, పెద్దపల్లి (బాలురు), రామగుండం, మల్లాపూర్, నంది మేడారం, గర్రెపల్లి (బాలికలు)లో మిగిలిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ సీట్లకు సోమవారం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఇప్పటికే రెండు విడతల్లో సీట్ల భర్తీ పూర్తయ్యిందని, మిగిలిన సీట్ల కోసం మంథనిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలురు)లో స్పాట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అభ్యర్థుల నమోదు ప్రక్రియ నిర్వహించి, అనంతరం స్పాట్ కౌన్సిలింగ్ చేపడతామని పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు వాటి రెండు జిరాక్స్ సెట్లు, విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స్, తల్లిదండ్రుల ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులు, నాలుగు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో కౌన్సిలింగ్ కేంద్రానికి హాజరు కావాలని ఉటూరి శ్రీనాథ్ సూచించారు.
