మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
చిట్యాల, ఆంధ్రప్రభ: కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిట్యాల పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గిద్దముత్తారం గ్రామానికి చెందిన పోతుగంటి సునీత కుమార్తె మౌనిక (35)కు వరికోలపల్లి గ్రామానికి చెందిన దుద్దేటి శ్రీనివాస్‌తో సుమారు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
భర్త శ్రీనివాస్ పనికి వెళ్లకుండా బాధ్యత లేకుండా తిరుగుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడంతో మౌనిక తీవ్ర మనస్తాపానికి గురైంది. తన ముగ్గురు పిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బాధపడిన ఆమె రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగినట్లు సమాచారం.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం రాత్రి మృతి చెందింది.
మృతురాలి తల్లి సుచిత్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.
