ఒక్క క్లిక్‌తో కూరగాయలు…

ఒక్క క్లిక్‌తో కూరగాయలు…

ఇంటి ముంగటికే కే రైతుబజార్ సేవలు
డిజి రైతుబజార్’తో డోర్ డెలివరీ ప్రారంభం
రైతు నుంచి వినియోగదారునికి నేరుగా సరఫరా
పట్టణ వినియోగదారులకు కొత్త సౌకర్యం

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : సాంప్రదాయ రైతుబజార్ వ్యవస్థను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సేవలను ప్రారంభించింది. ‘డిజి రైతుబజార్’ పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చిన యాప్, వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులు ఇప్పుడు కూరగాయలు, పండ్లు, పూలు, నిత్యావసరాలను ఇంటికే తెప్పించుకునే సౌకర్యం పొందుతున్నారు. రైతు నుంచి నేరుగా వినియోగదారునికి సరఫరా జరిగే విధంగా ఈ వ్యవస్థను రూపకల్పన చేయడం విశేషం.

ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నమోదు పూర్తిచేసిన వినియోగదారులు తమకు అవసరమైన ఉత్పత్తులను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వవచ్చు. సమీప రైతుబజార్ నుంచి సరుకులను సేకరించి నేరుగా ఇంటికే డెలివరీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, సరసమైన ధరలకు తాజా ఉత్పత్తులు అందే అవకాశం కలుగుతోంది. ప్రస్తుతం విజయవాడ పటమట రైతుబజార్‌లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

అదే విధంగా విశాఖపట్నంలో 11 రైతుబజార్లు, కాకినాడ, గుంటూరులో ఒక్కొక్క కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతుబజార్లకు ఈ సేవలను విస్తరించే ప్రణాళికను మార్కెటింగ్ శాఖ రూపొందించింది. ఏపీ మార్కెటింగ్ శాఖతో పాటు ప్రైవేట్ టెక్నాలజీ భాగస్వామి ‘మాచిట్’ సంస్థ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు లాజిస్టిక్స్, డిజిటల్ ట్రాకింగ్ వంటి అంశాలను సమన్వయం చేస్తున్నారు.

వినియోగదారులకు సౌలభ్యం రైతులకు లాభం..

పట్టణ ప్రాంతాల్లో వేగవంతమైన జీవనశైలిలో మార్కెట్‌కు వెళ్లే సమయం లేని వినియోగదారులకు ఈ యాప్ పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. మరోవైపు రైతులకు నేర మార్కెట్ లభించడం ద్వారా మెరుగైన ధరలు అందే అవకాశం ఉంది. డిజిటల్ వాణిజ్యం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ మార్కెటింగ్‌ను సాంకేతికతతో అనుసంధానించడం కీలక పరిణామంగా భావించాలి. సరఫరా గొలుసులో పారదర్శకత పెరగడం, ధరల నియంత్రణ సాధ్యం కావడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి రావడం ఈ విధానం ప్రధాన ప్రయోజనాలు. అయితే డెలివరీ వ్యవస్థ సమర్థత, నిల్వ సదుపాయాలు, యాప్ వినియోగంపై అవగాహన వంటి అంశాల కచ్చితంగా ఉంటే వినియోగదారులకు ఇది ఒక చక్కటి అవకాశం గా లభించనుంది.

అందరికీ ఉపయోగకరంగా….

డిజీ రైతు బజార్ యాప్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. వినియోగదారులతో పాటు రైతులకు సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు నిజాయితీ ధరలతో సురక్షితమైన పరిశుభ్రమైన కూరగాయలు అందించడం జరుగుతుంది. రైతులకు కూడా ఇది ఎంతో లాభదాయకంగా ఉండనుంది.