Bogus-Students-Giddalur సగానికి సగం బోగస్సే Andhra Prabha excludive Story
Bogus-Students-Giddalur సగానికి సగం బోగస్సే Andhra Prabha excludive Story
- ఇదీ ఎయిడెడ్ స్కూలు గతి
- హాజరు ఎయిడెడ్ బడిలో
- పాఠాలు ప్రైవేట్ స్కూళ్లలో..
- మధ్యాహ్నం భోజనమూ అంతే …
(గిద్దలూరు, ఆంధ్ర ప్రభ)
Bogus-Students-Giddalur మార్కాపురం జిల్లా గిద్దలూరు ప్రాంతంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో బోగస్ విద్యార్థుల ప్రక్షాళన జరిగేనా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గత విద్యా సంవత్సరంలో మార్కాపురం జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారిగా వ్యవహరించిన సివి రేణుక పాఠశాలల్లో బోగస్ రోల్ ప్రక్షాళన చేపట్టాలని మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గిద్దలూరు మండలంలోని 18 ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీల సమయంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల రోలుకు భౌతికంగా ఉన్న విద్యార్థుల సంఖ్యకు పొంతన లేకుండా ఉండటాన్ని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఎయిడెడ్ పాఠశాలల్లో బోగస్ హాజరు ఎక్కువగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. తనిఖీ సమయంలో ఎంతమంది విద్యార్థులు హాజరై ఉన్నారు.. యుడైస్ లో ఎంతమందిని నమోదు చేస్తున్నారు.. అనే విషయంపై విద్యాశాఖ అధికారులు లెక్కలు తీసి నివేదికలు అందజేశారు.గత విద్యా సంవత్సరం చివరిలో అప్పటి డిఈఓ సివి రేణుక స్వయంగా కొమరోలు మండలంలోని ఏయిడెడ్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా బోగస్ హాజరు బయటపడింది. అక్కడ వాస్తవంగా ఉన్న పిల్లల కన్నా ఎక్కువ మందికి హాజరు వేసి కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో గిద్దలూరు ప్రాంతంలో నిర్వహిస్తున్న ఏయిడెడ్ పాఠశాలలలో బోగస్ రోలు గుర్తించి నిగ్గు తేల్చాలని ఎంఈఓ లకు ఆదేశాలిచ్చారు. ఈ విద్యా సంవత్సరం జూన్ నాటికి ఎయిడెడ్ పాఠశాలల్లోని బోగస్ రోల్ ను ప్రక్షాళన చేపట్టాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఆ దశగా అడుగులు వేయకపోవడం అనుమానాలకు తావిస్తుందని పలువురు అంటున్నారు.ఎయిడెడ్ పాఠశాలలను తనిఖీ చేసిన సమయంలో బోగస్ రోల్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి ఆయా పాఠశాలల కరస్పాండెంట్లకు, ప్రధానోపాధ్యాయులకు గత ఏడాది రెండు పర్యాయాలు మండల విద్యాశాఖ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా బోగస్ రోలుతో పాఠశాలలు కొనసాగుతుండగా మధ్యాహ్న భోజన పథకంలో కూడా భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. గతంలో మండల విద్యాశాఖ అధికారులతో చేతులు కలిపిన ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు బోగస్ విద్యార్థుల కాకి లెక్కలు చూపుతూ వచ్చారనే విమర్శలున్నాయి. గత విద్యా సంవత్సరంలో జరిగిన తనిఖీల్లో విద్యార్థులు తక్కువగా, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థుల పేర్లు పాఠశాలలో(యుడైస్) ఉన్నప్పటికీ అధిక శాతం మంది విద్యార్థులు భౌతికంగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారనే విషయాన్ని కూడా అధికారులు గుర్తించారు. గత ఏడాది గిద్దలూరులోని ఎయిడెడ్ పాఠశాలలను అప్పటి విద్యాశాఖ డైరెక్టర్ పి పార్వతి ఆకస్మికంగా తనిఖీ చేసి భారీగా బోగస్ రోలు ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడాన్ని కూడా ఆమె గుర్తించారు. అయినప్పటికీ పాఠశాలల్లో బోగస్రోల్ కొనసాగిస్తూనే ఉన్నట్లు తెలిసింది.
Bogus-Students-Giddalur సగానికి సగం బోగస్ విద్యార్థులే..
గిద్దలూరు పట్టణంలోని సిసి ఎయిడెడ్ పాఠశాలలో 21 మంది, సీసీ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 41 మంది, డీఎంఆర్ఏ యూపీ స్కూలులో 70 మంది, హిందూ ఎయిడెడ్ యూపీ స్కూలులో 123 మంది, శ్రీ శారద ఎయిడెడ్ స్కూల్లో 118 మంది, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఎయిడెడ్ పాఠశాలల్లో 116మంది, సెయింట్ పాల్స్ ఎయిడెడ్ స్కూల్ సత్యనారాయణ నగర్ లో 122మంది, ముండ్లపాడు సెంట్ జోకప్ హైస్కూల్లో 155 మంది, సెయింట్ పాల్స్ ఎయిడెడ్ సొసైటీ కాలనీలో 150మంది, సెయింట్ పాల్స్ ఎయిడెడ్ స్కూల్ రైల్వే కాలనీ లో 122మంది, సెయింట్ పాల్స్ ఎయిడెడ్ హైస్కూల్లో 159మంది, సెయింట్ పాల్స్ ఎయిడెడ్ స్కూల్ గణేష్ నగర్ లో 94మంది, సెయింట్ పాల్స్ హైస్కూల్ రైల్వే కాలనీలో 253 మంది, సెంట్ పాల్స్ ఏపీఎస్ నాయక్ స్ట్రీట్ లో 41మంది, సెయింట్ పాల్స్ ఏపీఎస్ నల్లబండ బజార్ లో141 మంది, సెయింట్ పాల్స్ ఏపీఎస్ పాండురంగారెడ్డి నగర్ లో 30మంది, సెయింట్ సేలం యుపిఎస్ లో 117మంది, ముండ్లపాడు సెయింట్ జాకప్ యు పి స్కూల్లో 121 మంది విద్యార్థుల రోలు నమోదు చేసి ఉన్నారు. గిద్దలూరు లోని మొత్తం 18 ఎయిడెడ్ పాఠశాలల్లో 1994 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపిస్తుండగా భౌతికంగా విద్యార్థుల హాజరు 800 ల లోపే అని విద్యాశాఖ అధికారుల ద్వారా తెలిసింది. ఎయిడెడ్ పాఠశాలల్లో తనిఖీలకు సంబంధించి వాస్తవ పరిస్థితులను బోగస్రోల్ వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి మండల విద్యాశాఖ అధికారులు నివేదికలు కూడా అందజేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో బోగస్త్రోల్ ఉన్నట్లు విద్యార్థుల రోలుకు హాజరుకు పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉన్న విషయం వాస్తవమేనని విద్యాశాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం జూన్ నాటికి ఎయిడెడ్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో బోగస్ విద్యార్థులను తొలగించాలని అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ అధికారులు ఆదేశించగా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు లేకపోగా ఉపాధ్యాయులు హాజరుకే పరిమితం అవుతున్నారని విమర్శలు ఉన్నాయి. జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లోని బోగస్ విద్యార్థుల ఏరివేతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Bogus-Students-Giddalur మిడ్ డే మీల్ నిధులూ పక్కదారి…
ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్న ఎక్కువమంది హాజరు చూపించి మధ్యాహ్నం భోజన పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు సగానికి సగం పాఠశాలలో లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా హాజరు వేస్తూ మధ్యాహ్నం భోజన పథకం నిధులు బొక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పాఠశాలలను తనిఖీ చేయాల్సిన మండల విద్యాశాఖ అధికారులు సైతం మౌనం పాటించి ప్రధానోపాధ్యాయులకు సహకరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.ఇప్పటికైనా ఏయిడెడ్ పాఠశాలల్లో బోగస్ విద్యార్థుల ప్రక్షాళనకు తనిఖీలు నిర్వహించాలని ప్రజల తల్లిదండ్రులు విద్యావేత్తలు కోరుతున్నారు.
