Wyra | ‘మట్టి’ కొట్టుకు పోతున్నారు…
Wyra | ‘మట్టి’ కొట్టుకు పోతున్నారు…
- వైరా చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులు..
- రాత్రి వేళల్లో జెసిబి తో ఐదు ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపు..
- స్పందించని నీటిపారుదల శాఖ అధికారులు..
వైరా, ఆంధ్రప్రభ : వైరా చెరువు మట్టిని కొందరు అక్రమార్కులు తోడేస్తున్నారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా చెరువు మట్టిని అక్రమంగా ఐదు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో జెసిబిల ద్వారా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇటువంటి అక్రమ చర్యలకు కొందరు అక్రమార్కులు పాల్పడుతున్నారు.
రాత్రి వేళల్లో రహస్యంగా… ఎటువంటి భయ-బెరుకులేకుండా… రాజకీయ నాయకుల అండదండలు తమకు ఉన్నాయనే ధైర్యంతో కొందరు ఈ దుస్సాహసాలకు పాల్పడుతున్నారు. చట్టం తమ చేతిలోనే ఉందన్నట్లు, అధికార అంగబలాన్ని ఆయుధంగా మార్చుకొని అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.
వైరా ప్రాంతంలోని టీచర్స్ కాలనీ సమీప చెరువులో ఇదే దృశ్యం కనిపిస్తోంది. చెరువు శిఖం మట్టిని బహిరంగంగా, దర్జాగా తరలిస్తూ… ప్రభుత్వ ఆస్తిని తమ సొత్తుగా భావించి ఏ మాత్రం వెనుకాడకుండా రోజుకు 40 వరకు ట్రాక్టర్లతో తరలింపులు జరుగుతున్నాయి. చెరువు మట్టిని ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేస్తూ, అక్కడి నుంచి నిర్బంధం లేకుండా మళ్లీ బయటకు తరలిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఈ అక్రమాలకు అధికారుల అండ ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సొమ్మును దోచుకునే ఈ రహస్య రవాణాపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి… చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులు కోరుతున్నారు.
