నగరాభివృద్ధి పనులపై కమిషనర్ నజర్
నగరాభివృద్ధి పనులపై కమిషనర్ నజర్
- యూజీడీ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించిన అభిషేక్ అగస్త్య
- రోప్‌వే నిర్మాణంపై దశల వారీ నివేదిక ఇవ్వాలని ఆదేశం
- గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని సూచన
- కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య,
ఖమ్మం, ఆంధ్రప్రభ : నగరంలో చేపడుతున్న కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఐఏఎస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఆర్‌జీ టవర్స్ పరిసరాల్లో జరుగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సమీక్షించారు. పనుల ప్రస్తుత స్థితి, రాబోయే రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలపై కాంట్రాక్టర్‌ను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైతే అదనపు యంత్రాలు, సిబ్బందిని వినియోగించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తర్వాత ఖమ్మం కిల్లా వద్ద నిర్మాణంలో ఉన్న రోప్‌వే ప్రాజెక్టును కమిషనర్ పరిశీలించారు. నిర్మాణ పురోగతి, చేపడుతున్న పనులు, రానున్న దశల్లో అమలు చేయాల్సిన కార్యాచరణపై టూరిజం శాఖ ప్రతినిధులు, కాంట్రాక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తి చేసే వరకు దశల వారీగా పురోగతి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. నిర్ణీత గడువుల్లో పనులు పూర్తి చేసి నగర అభివృద్ధికి వేగం తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.
