కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు సమన్యాయం

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు సమన్యాయం

  • నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి , ఆంధ్రప్రభ:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

బుధవారం చిట్కుల్‌లోని తన కార్యాలయంలో నూతనంగా నియమితులైన చిట్యాల శ్వేత నీలం మధు ముదిరాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, మిఠాయి తినిపించి సత్కరించారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, సాయుధ పోరాట యోధులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం చాకలి ఐలమ్మ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, నేడు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని పేర్కొన్నారు.

ఇది బహుజన వర్గాలకు, ముఖ్యంగా రజక సామాజిక వర్గానికి దక్కిన గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు.

చిట్యాల శ్వేత మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతాయుతమైన పదవి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ధన్యవాదాలు తెలిపారు. మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

Leave a Reply