చేనేత సహకార సంఘాల రూ.35 కోట్ల రుణాలు మాఫీ చేయాలి

చేనేత సహకార సంఘాల రూ.35 కోట్ల రుణాలు మాఫీ చేయాలి
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వినతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలపై పేరుకుపోయిన సుమారు రూ.35 కోట్ల రుణభారాన్ని (క్యాష్ క్రెడిట్ బకాయిలు) తక్షణమే మాఫీ చేసి నేతన్నలను ఆదుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో కలిసి ఎంపీ చామల .. రాష్ట్ర చేనేత, జౌళి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ
సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. బకాయిల భారం నానాటికీ పెరిగిపోవడంతో అనేక సంఘాలు ప్రస్తుతం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని వివరించారు. ఈ రుణభారాన్ని మాఫీ చేస్తేనే సహకార సంఘాలకు పూర్వవైభవం వస్తుందని ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం: మంత్రి తుమ్మల హామీ
ఎంపీ, చేనేత ప్రతినిధుల వినతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, చేనేత సహకార సంఘాలకు పూర్తి న్యాయం జరిగే విధంగా తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం తరఫున శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఎంపీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సహకార సంఘాలు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహన్ ను కూడా కలిసి చేనేత సంఘాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమరి శ్రీనివాస్, సహకార సంఘాల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భారత వాసుదేవ్, సహకార సంఘాల యూనియన్ అధ్యక్షులు రామేశ్వరం, జనగాం జిల్లా అధ్యక్షులు వేముల బాలరాజు, పోచంపల్లి చేనేత సహకార సంఘ డైరెక్టర్ సురేపల్లి శ్రీనివాస్, గంజి అంజయ్య తదితర ముఖ్య నాయకులు, చేనేత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
