Narsingi | రూ.8 కోట్ల విల్లాపై ఏసీబీ తనిఖీలు
Narsingi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై డీఎస్పీ ఎస్. భీమ్‌రెడ్డి నివాసంలో గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తనిఖీలు హైదరాబాద్‌లోని భీమ్‌రెడ్డి నివాసంతో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.
నార్సింగిలోని వెసెల్లా మెడోస్ విల్లాలో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే రెండు ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, భీమ్‌రెడ్డి సుమారు రూ.8 కోట్ల విలువైన విల్లాలో నివసిస్తున్నట్లు, అలాగే ఆయన ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది.
భీమ్‌రెడ్డి గతంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం, జహీరాబాద్, బాల్నగర్ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. అనంతరం డీఎస్పీగా పటాన్‌చెరువులో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలోని కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తున్నారు.
సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలించిన అనంతరం పూర్తి సమాచారం వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
