వీబీజీ-రాంజీ పథకం గ్రామీణ ఉపాధికి బలమైన హామీగా నిలుస్తుంది

  • ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

వీబీజీ-రాంజీ పథకం ప్రారంభించిన అవనిగడ్డ ఎమ్మెల్యే

అశ్వారావుపాలెం, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : నూతనంగా అమలు చేస్తున్న వీబీజీ-రాంజీ పథకం గ్రామీణ ఉపాధికి మెరుగైన హామీగా నిలుస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీజీ-రాంజీ) కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూజలు నిర్వహించి పంట బోదులు, మురుగు బోదుల పూడికతీత పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీజీ-రాంజీ పథకం ద్వారా ఉపాధి కార్మికులకు 125 రోజుల పని లభిస్తుందని తెలిపారు. పథకం సిబ్బంది పంట బోదులు, మురుగు బోదుల పూడికతీత పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులకు మేలు చేయాలని సూచించారు. పనులు బాధ్యతాయుతంగా పర్యవేక్షిస్తూ నిబంధనల ప్రకారం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతి, ఎంపీడీఓ మరియాదేవి, మాజీ సర్పంచ్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, ఎంపీటీసీ కటికల వసంత్, ఉపాధి పథకం సిబ్బంది పాల్గొన్నారు.