గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యం
- ఎంపీ పార్థసారథి
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని కొండమనాయునిపాల్యం గ్రామంలో వికసిత్ భారత్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ (VB-GRAM-G) పథకం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారథితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధి, జీవనోపాధి మార్గాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని కార్యక్రమంలో వివరించారు.
గ్రామీణ యువత, మహిళలు, రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ పథకం ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, ఆదాయ వృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ బి.కె. పార్థసారథి మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఉపాధి కల్పనతో పాటు గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గ్రామస్థులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా వినియోగించుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు, యువత, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి దిశగా ఈ పథకం ఉపాధి అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం ప్రజలతో మమేకమైన ప్రజాప్రతినిధులు పథకం అమలుపై అవగాహన కల్పించి, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
