మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకుడు

పరకాల (ఆంధ్రప్రభ): పరకాల నూతన మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్‌ను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు.

వినతిపత్రంలో పట్టణంలోని అన్ని వార్డుల్లో రోడ్ల వెంట, ఫుట్‌పాత్‌లపై, డ్రైనేజీలపై ఏర్పాటైన అక్రమ నిర్మాణాలు, షెడ్లు, బోర్డులు, మెట్లు తదితర అడ్డంకులను తొలగించాలని కోరారు. ప్రధాన రహదారులు, మూలమలుపుల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాల వల్ల మురుగునీరు రోడ్లపైకి వచ్చి ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

దళిత కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని, వారానికి ఒకసారి బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలని, వీధిదీపాలు, తాగునీటి పైపుల లీకేజీలను సరిచేయాలని కోరారు. అలాగే అసంపూర్తిగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేయడంతో పాటు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లు, ప్రభుత్వ సంక్షేమ సౌకర్యాలు, అవసరమైన వైద్య సహాయం అందించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున ఏకు శంకర్ మాదిగ విజ్ఞప్తి చేశారు.